ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటిసులు వ్యూహాత్మకంగా ఇచ్చినవేనా..? బీఆర్ఎస్ – బీజేపీల మధ్య క్విడ్ ప్రోకోలో భాగంగానే కవిత అరెస్ట్ నిలిచిపోయిందని.. కాంగ్రెస్ వైపు చూస్తున్న నేతలను కన్ఫ్యూజ్ చేసేందుకే ఈ నోటిసులు ఇచ్చారా..? బీజేపీ – బీఆర్ఎస్ ల నుంచి ఊహించని నేతలు సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రకటనతో.. చేరికలను నిలువరించేందుకే కవితకు నోటిసులు ఇచ్చారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో స్తబ్దుగా ఉన్న ఈడీ ఆర్నెళ్ళ తరువాత కవితకు తాజాగా నోటిసులు ఇవ్వడం సర్వత్రా చర్చనీయంశం అవుతోంది. ఫిబ్రవరిలో కవితను విచారణకు పిలిచిన సమయంలోనే ఆమెను అరెస్ట్ చేస్తామన్నంత పని చేసింది ఈడీ. కాని ఆ తరువాత విచారణ వేగం తగ్గింది..అరెస్ట్ అవుతుందనుకున్న కవిత అరెస్ట్ నిలిచిపోయింది. కవితను లిక్కర్ స్కామ్ నుంచి రక్షించేందుకు బీఆర్ఎస్, బీజేపీతో అంతర్గత ఒప్పందం చేసుకుందని… అందుకే ఈడీ విచారణ ఆగిపోయిందని ఆరోపిస్తూ పలువురు కేసీఆర్ వ్యతిరేకులు, ఉద్యమకారులు, బీజేపీ నేతలు కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అవుతున్నారు.
కేసీఆర్ ఆట కట్టిస్తుందని బీజేపీలో చేరిన నేతలు…లిక్కర్ స్కామ్ లో కవితను ఎవరూ కాపాడలేరని ధీమాగా ప్రకటించారు. ఢిల్లీ పెద్దలు సైతం ఇదే మాట చెప్పారు. కాని అంత ఉత్తదే అయింది. పైగా కొన్నాళ్ళుగా మోడీపై కేసీఆర్ పల్లెత్తు మాట అనకపోవడం..కేటీఆర్ కు అమిత్ షా అడిగిన వెంటనే అపాయింట్ మెంట్ ఇవ్వడం.. బీఆర్ఎస్ అనుకూల నేతగా వ్యవహరిస్తారని ఆరోపణలు ఉన్న కిషన్ రెడ్డిని పార్టీ రాష్ట్ర అద్యక్షుడిగా నియమించడంతో ఆ పార్టీలోనున్న నేతలకు క్లియర్ కట్ పిక్చర్ కనబడినట్లు అయింది.
కేసీఆర్ ను గద్దె దించాలనే లక్ష్యంతో బీజేపీలో చేరిన నేతలు… బీజేపీతో బీఆర్ఎస్ కు ఒప్పందం కుదరిందని ఓ అంచనాకు వస్తున్నారు. బీజేపీలో ఉండి బీఆర్ఎస్ ను ఓడించడం సాధ్యం కాదని భావించి కాంగ్రెస్ లో చేరేందుకు సిద్దం అవుతున్నారు. సెప్టెంబర్ 17న సోనియా సమక్షంలో కీలక నేతలు చేరనున్నారు. దీంతో కాంగ్రెస్ లో చేరికలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు..బీఆర్ఎస్ – బీజేపీలు వేర్వేరని చాటేందుకు.. లిక్కర్ స్కామ్ ఎపిసోడ్ లో కవితకు నోటిసులు ఇప్పించారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కవితను విచారణ పేరుతో పిలిచి అరెస్ట్ చేసినా అదంతా వ్యూహమేనని అంటున్నారు రాజకీయ పరిశీలకులు. ఎందుకంటే.. ఎన్నికల ముంగిట ఇవన్నీ బీఆర్ఎస్ కు ఫేవర్ చేస్తాయి. కవితను అరెస్ట్ చేస్తే మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి డిమాండ్ చేసినందుకు లిక్కర్ స్కామ్ లో ఇరికించారని..తెలంగాణ మహిళాకు జరిగిన అవమానమని బీఆర్ఎస్ సెంటిమెంట్ రెచ్చగొట్టే అవకాశం ఉందని అంటున్నారు. రెండు పార్టీల గ్రాఫ్ పతనం అవుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కు ఫేవర్ చేసేందుకు కవితను అరెస్ట్ చేసినా ఆశ్చర్యపోనవసరం లేదని విశ్లేషిస్తున్నారు.
Also Read : లిక్కర్ స్కామ్ లో కదలిక – మోడీపై కవిత ప్రశంసలు..!!