ఎమ్మెల్యేల కొనుగోలు కేసుతో పొలిటికల్ మైలేజ్ పొందాలని భావించిన కేసీఆర్ కు ఏదీ కలిసిరావడం లేదు. ముఖ్యంగా ఈ కేసును కేంద్ర దర్యాప్తు సంస్థల గుప్పిట్లోకి వెళ్ళకుండా చేయాలని ప్రయత్నించి విఫలమైనట్టు కనిపిస్తోంది.ఈ కేసును సిట్ దర్యాప్తు చేస్తోంది. సిట్ విచారణ రాష్ట్ర ప్రభుత్వ కనుసన్నలో నడుస్తుందని సీబీఐకి ఇవ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు అయింది. ఈ పిటిషన్ విచారణలో ఉండగానే.. ఈడీ వేట మొదలు పెట్టింది. మనీలాండరింగ్ జరిగిందని రంగంలోకి దిగింది. సీబీఐకైతే పర్మిషన్ కావాలి. ఈడీకి అనుమతులు అవసరం లేదు. దీంతో ఈ కేసుపై ఈడీ కాముష్ గా విచారణ ప్రారంభించింది.
టీఆర్ఎస్ నలుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరితే ఇస్తామన్న వందల కోట్లు ఎక్కడి నుంచి వస్తాయో తేల్చాలని ఈడీ ప్రయత్నిస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడిగానున్న నందకుమార్ చుట్టే ఈ వ్యవహారమంతా తిరుగుతోంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. దీంతో ఆయన్ను కస్టడీలోకి తీసుకోవాలని ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పైలెట్ రోహిత్ రెడ్డి వ్యాపారంపై ఈడీ ఫోకస్ చేసింది. ఆయన ఆర్ధిక లావాదేవీలను పరిశీలించింది. ఇప్పటికే రోహిత్ రెడ్డిని విచారించిన ఈడీ ఈ నెల 27న మరోసారి విచారణకు హాజరు కావాలని చెప్పారు. నందుతో పైలెట్ కున్న వ్యాపార సంబంధాలపై విచారించనున్నట్లు తెలుస్తోంది.
నందకుమార్ వ్యాపార సంస్థలో కల్వకుంట్ల కన్నారావు డైరక్టర్ గా ఉన్నారు. ఈయనతోపాటు ఆవుల అభిషేక్ అనే వ్యక్తి కూడా అడిషనల్ డైరక్టర్ గా ఉన్నారు. వీరిని ఈడీ విచారణకు పిలిచి ప్రశ్నిస్తోంది. ఎమ్మెల్యేలకు ఆఫర్ చేసిన డబ్బు ఎక్కడిది..? ఆ డబ్బును ఎవరు సర్దుబాటు చేస్తారు..? ఇందులో ఎవరెవరి ప్రమేయముందనే విషయాలను తేల్చే పనిలో పడింది ఈడీ. ఇందుకోసం నందకుమార్ విచారణ కోరుతూ పిటిషన్ దాఖలు చేసింది. ఫామ్ హౌజ్ వ్యవహారంపై చర్చించేందుకే ఈ పిటిషన్ దాఖలు చేశారు. నందుకు టీఆర్ఎస్ నాయకులతో మంచి పరిచయాలు ఉన్నాయి. దీంతో వీరందరినీ ఇరుకున పెట్టేలా బీజేపీ సీక్రెట్ రిపోర్ట్ రెడీ చేసి ఇచ్చినట్లు తెలుస్తోంది.
అయితే, పైలెట్ రోహిత్ రెడ్డికి, ఎమ్మెల్యేల కొనుగోలు కేసు నిందితుడు నందకుమార్ ల మధ్య వ్యాపార లావాదేవీలు ఉన్నట్లు ఈడీ ప్రాథమిక విచారణలో గుర్తించింది. వీరి మధ్య జరిగిన ఆర్ధిక లావాదేవీలను పరిశీలిస్తోంది. దీంతో ఈ కేసు విషయంలో డబ్బు లావాదేవీల గురించే ఈడీ విచారణ చేసినా ఫైనల్ గా అసలు కుట్ర ఏమిటో బయటపడే అవకాశం కనిపిస్తోంది.