టీఆర్ఎస్ లో ఉన్నాన్నాళ్ళు ఆపై బీజేపీలో చేరాక అత్యంత సన్నిహితంగా మెదిలిన ఇద్దరు తెలంగాణ బీజేపీ కీలక నేతల మధ్య కయ్యం మొదలైంది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ , మరో నేత వివేక్ వెంకటస్వామిలు పార్టీ నేతల సమక్షంలోనే రెచ్చిపోయారు. సంక్రాంతి రోజున వందే భారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ఈ ఇద్దరు నేతలు వాగ్వాదానికి దిగారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక సమయంలో ఈటల ఆర్థిక మూలాలను దెబ్బకొట్టారు కేసీఆర్. పారిశ్రామిక వేత్తలు , సన్నిహితులు ఆర్థిక సాయం చేయకుండా ఉండేలా కేసీఆర్ చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈటలకు ఎన్నికల ఖర్చు ఇతరత్రా అవసరాల కోసం బీజేపీ నేత వివేక్ 10 కోట్ల ఆర్థిక సాయం చేశారు. ఎన్నికల అనంతరం తిరిగి ఇచ్చేలా ఇద్దరు ఒప్పందం చేసుకున్నారు. 2021 అక్టోబర్ లో ఈ ఉప ఎన్నిక జరిగింది. బైపోల్ ముగిసి ఏడాది అయిపోయినా ఈటల ఒప్పందం ప్రకారం డబ్బులు తిరిగి చెల్లించకపోవడంతో వివేక్ పలుమార్లు అడిగినట్లు సమాచారం. ఫోన్ చేసి అడిగితే… డబ్బులకు బదులుగా స్థలం రాసిస్తానని హామీ ఇచ్చారట ఈటల. ఈ హామీ కూడా ఇచ్చి నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్థలం కూడా ఇవ్వకపోవడంతో ఈ రచ్చ జరిగినట్లు తెలుస్తోంది.
ఇటీవల మునుగోడు ఉప ఎన్నిక ఇంచార్జ్ బాద్యతలను వివేక్ కు అప్పగించడంతో ఆయనకు డబ్బు అవసరం ఏర్పడింది. దాంతో ఆయన ఈటలపై ఒత్తిడి తీసుకురాగా..మరికోద్ది రోజుల్లోనే స్థలం రాసిస్తానని హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ విషయం మనసులోనే పెట్టుకొనే ఇద్దరు నేతలు మునుగోడు బైపోల్ సమయంలో ఎడమొహం, పెడమొహంగా ఉన్నట్టు తాజాగా అర్థం అవుతోంది. అయితే.. మునుగోడు ఉప ఎన్నిక కూడా ముగిసి నెలలు గడుస్తున్నా ఇంతవరకు స్థలం రాసివ్వకపోవడంతో వివేక్ ఆగ్రహంగా లోనయ్యారు.
ఆదివారం వందేభారత్ రైలు ప్రారంభోత్సవం సందర్భంగా ఈటల రాజేందర్, వివేక్ ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా వివేక్ నేరుగా ఈటలను డబ్బులు ఇస్తావా? లేదంటే స్థలం రాసిస్తావా? అని నిలదీశారు. అప్పుడు అక్కడ పార్టీ నేతలంతా ఉన్నారు. అందరి ముందు డబ్బులు గురించి నిలదీయడంతో సహనం కోల్పోయిన ఈటల వివేక్ తో వాగ్వవాదానికి దిగారు. ఈ విషయమై బండి సంజయ్ తో ఫిర్యాదు చేసేందుకు వివేక్ రెడీ అవుతుండగా.. జాతీయ నేతలకు ఫిర్యాదు చేసి తేల్చుకుంటానని ఈటల అన్నట్లు సమాచారం.
వివాదరహితుడు..కమిట్మెంట్ కల్గిన నేతగా పేరున్న ఈటల ఇలా డబ్బు విషయంలో ప్రామిస్ చేసి తప్పడం ఆయన క్రెడిబిలిటిని దెబ్బతీసే అవకాశం ఉంది. సొంత పార్టీ నేతకే నమ్మకద్రోహం చేసిన నేత ప్రజలకు ఎలా ఉపయోగపడుతాడనే విషయాన్ని ప్రత్యర్ధులు జనాల్లోకి తీసుకెళ్ళే అవకాశం ఉందన్నది సుస్పష్టం. ఇప్పటికే ఈటలపై భూ ఆక్రమణ ఆరోపణలు ఉండగా.. తాజాగా వివేక్ కు 10కోట్లు ఎగ్గొట్టేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్త ఆయన ఇమేజ్ ను దెబ్బతీసేదిగా చెప్పొచ్చు.
Also Read : బండి వర్సెస్ ఈటల – హైకమాండ్ కు పోటాపోటీగా ఫిర్యాదులు