తెలంగాణ బీజేపీ నేతల మధ్య ఎలా సయోధ్య కుదుర్చాలో అగ్రనేతలకు అంతుపట్టడం లేదు. బండి సంజయ్ ను అద్యక్ష బాధ్యతల నుంచి దించేయాలని ఓ వర్గం నేతలంతా కోరుతున్నారు. ఇప్పుడున్న పరిస్థితులలో బండిని మార్చడం సరైంది కాదని హైకమాండ్ అంటోంది. అదే సమయంలో బండి నాయకత్వంలో పని చేయలేమని చెబుతున్నా నేతలకు తియ్యని కబురు పంపింది. ఈటలకు కీలకమైన పదవి ఇస్తామని చెప్పింది కానీ ఇప్పటివరకు ఆ పదవి ఏంటో..? ఎప్పుడు ఇస్తారో చెప్పడం లేదు.
ఈటలకు పదవి ఇస్తే ఒకే. లేదంటే అందరం కలిసి ఒకేసారి కాంగ్రెస్ లో చేరుదామని ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలంతా ఆలోచిస్తున్నారు. కొంతమంది నేతలు కాంగ్రెస్ నాయకత్వంతో టచ్ లో కూడా ఉన్నారు. వచ్చే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ పై హామీ ఇస్తే కాంగ్రెస్ లో చేరేందుకు రెడీ అయ్యారు. దీంతో పరిస్థితిని అంచనా వేసిన కమలాదళం నష్టనివారణ చర్యలు చేపట్టింది.
ఈటలను ఢిల్లీ రావాలని కబురు పంపింది. బండి సంజయ్ ను పిలవకుండా కేవలం ఈటల పిలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. బీజేపీలో అసంతృప్త నేతలకు ఈటలనే పెద్దదిక్కుగా ఉన్నారని.. ఈటలను శాంతింపజేస్తే మిగతా నేతలంతా సైలెంట్ అవుతారనే తలంపుతో అగ్రనాయకత్వం ఉంది. అందుకే ఆయన్ను ఢిల్లీకి రమ్మని పిలిచి ఉండొచ్చునని అంటున్నారు. కర్ణాటక ఎన్నికల రిజల్ట్ తరువాత బీజేపీలో జోష్ తగ్గింది.
కాంగ్రెస్ లో ఉత్సాహం కనిపిస్తోంది. కర్ణాటక ఎన్నికల వరకు బీజేపీలో చేరుదామని అనుకున్న నేతలు, పార్టీలో అసంతృప్త నేతలు రిజల్ట్స్ తరువాత మనస్సు మార్చుకున్నారు. బీజేపీని కాదనుకొని కాంగ్రెస్ లో చేరుతారనే టాక్ విస్తృతంగా వినిపిస్తోంది. బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా నున్న ఈటల ఇతర పార్టీల నేతలను బీజేపీలో చేర్చుకునేలా ప్రయత్నించారు కానీ ఏవీ వర్కౌట్ అవ్వలేదు.
ఈ సమయంలో ఈటల కూడా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో చల్లబడ్డారు. సంప్రదింపులకు ఫుల్ స్టాప్ పెట్టేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకున్న హైకమాండ్ ఈటల వెంటనే ఢిల్లీ రావాలని కోరింది. మరి ఈటలకు అధిష్టానం పదవిపై భరోసా ఇస్తుందో..? పదవి లేదు సర్దుకుపో అని బుజ్జగిస్తుందో చూడాలి.