వరుస పరాజయాలతో వైసీపీలో పూర్తి నిస్తేజం కనిపిస్తోంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి ఎదురైనప్పటికీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడు స్థానాలను కైవసం చేసుకొని టీడీపీ గెలుపు సంబరాలను ఆవిరి చేయాలనుకుంది వైసీపీ. కానీ ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఏడో స్థానంలో ఓటమి పాలవ్వడాన్ని వైసీపీ అస్సలు జీర్ణించుకోలేకపోతుంది. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అని యోచిస్తోంది.
సొంత పార్టీ ఎమ్మెల్యేలు ప్రత్యర్ధిపార్టీకి ఓటేయడంతో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గెలుపొందారు. దీంతో ఎమ్మెల్యేలపై జగన్ కు పట్టు సడలిందని.. వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోతే మరికొందరు ఎమ్మెల్యేలు కూడా పార్టీ వ్యతిరేక చర్యలకు పాల్పడుతారని వేటు వేశారు. ఇదంతా బాగానే ఉన్నా…వైసీపీని మాత్రం ఓటమి భయం వెంటాడుతోంది.
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములపై అప్పుడే చర్చిస్తోంది. వరుసగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించిన టీడీపీ వచ్చే ఎన్నికల్లో విజయం మాదేనని బలంగా ప్రచారం చేసుకుంటుంది. పైగా ఇద్దరు,ముగ్గురు వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలో చేరనున్నారు. ఇదే జరిగితే అధికార వైసీపీ బలహీనపడిందని జనం అనుకునే పరిస్థితి ఉంటుంది. అందుకే సీఎం జగన్ వీలైనంత తొందరగా ఎన్నికలకు వెళ్లాలనే ఆలోచనతో ఉన్నట్లు వైసీపీలో గుసగుసలు గుప్పుమంటున్నాయి. ఇంకా ఆలస్యం చేస్తే ప్రభుత్వం మీద ఇప్పుడు ఉన్న వ్యతిరేకత మరింత పెరిగే అవకాశం ఉందని తొందర పడుతోంది. లోగడ కెసిఆర్ కూడా ఇలాగే ముందస్తు ఎన్నికలకు వెళ్లి విజయం సాధించడంతో జగన్ ఇదే స్ట్రాటజీని అప్లై చేసే విషయమై ఆలోచిస్తున్నారు.
ఈ ఏడాది అప్పుల పరిమితిని మూడు, నాలుగు నెలల్లో వాడుకొని పంచాల్సింది పంచేసి ఎన్నికలకు వెళ్తే సంక్షేమ పథకాల లబ్దిదారులు ఆదరిస్తారని లెక్కలు వేసుకుంటున్నారు. ఆమధ్య తెలంగాణతోపాటు ఏపీలోనూ అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరిగింది. ఇటీవలి ఎమ్మెల్సి ఎన్నికల ఫలితాలతో వైసీపీ తాజాగా ఇదే రకమైన ఆలోచన చేస్తోందన్న వార్తలు వస్తున్నాయి. అందుకే కీలకమైన స్థానాల్లో తమకు అనుకూలమైన వ్యక్తులను ఏపీ సర్కార్ నియమించుకుంది. మరికొన్ని స్థానాల్లో కూడా త్వరలోనే మార్పులు చేసి తెలంగాణతోపాటు ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.