కేసీఆర్… నిన్నమొన్నటి వరకు ఓ ప్రాంతీయ పార్టీ అధినేత. ఇప్పుడు జాతీయ పార్టీ అధినేతగా తనను తాను కేసీఆర్ ప్రొజెక్ట్ చేసుకుంటున్నారు. ఇటీవల పార్టీ పేరును మార్చి పార్టీకి జాతీయ స్థాయి పార్టీగా గుర్తింపు తీసుకొచ్చే పనిలో నిమగ్నమయ్యారు. అయితే ఇదంతా ఆషామాషీ కాదు. అందుకే బీఆర్ఎస్ పార్టీ ద్వారా తనకు జాతీయ స్థాయి ఇమేజ్ తెచ్చుకునేందుకు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
ఖమ్మంలో బీఆర్ఎస్ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. ఈ సభకు ముగ్గురు ముఖ్యమంత్రులను ఆహ్వానించారు. మరికొంతమంది కీలక నేతలు హాజరు కానున్నారు. వారంతా తన కోసమే వచ్చారని చూపించుకునేందుకు తహతహలాడుతున్నారు కేసీఆర్. ముగ్గురు ముఖ్యమంత్రులు , కమ్యూనిస్టు పార్టీ నేతల కోసం ప్రత్యేక విమానాలను ఏర్పాటు చేశారు. 100 మంది ప్రముఖుల కోసం హైదరాబాద్ లోని స్టార్ హోటళ్లలో వసతి ఏర్పాటు చేశారు.
ఆమ్ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్, పంజాబ్ సీఎం భగవంత్ సింగ్ మాన్, సీపీఎంకు చెందిన కేరళ సీఎం పినరయి విజయన్, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, సీపీఐ జాతీయ కార్యదర్శి రాజా వంటి వారు రానున్నారు. ఈ సభకు కుమారస్వామి వస్తారని అంటున్నా.. ఇంకా స్పష్టత లేదు. దాదాపు ఆయన వచ్చే అవకాశమే ఉంది. ఎందుకంటే ఈ ఏడాది జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కుమారస్వామి పార్టీకి కేసీఆర్ ఆర్ధిక సహకారం అందిస్తామని హామీ ఇచ్చారని అంటున్నారు. దీంతో ఆయన బీఆర్ఎస్ నిర్వహించే మొదటి సభకు హాజరయ్యే అవకాశం ఉంది.
బహిరంగ సభకు హజరయ్యే నేతలంతా బుధవారం ప్రగతి భవన్లో సీఎం కేసీఆర్‌తో సమావేశమవుతారు. ప్రస్తుత జాతీయ రాజకీయాలపై చర్చిస్తారు. అనంతరం అల్పాహారం తీసుకుంటారు. అక్కడి నుంచి రెండు హెలికాప్టర్లలో యాదాద్రి వెళ్లి లక్ష్మీ నర్సింహస్వామి దర్శనం చేసుకుంటారు. ఖమ్మం వెళ్లి కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. నలుగురు ముఖ్యమంత్రులు, అఖిలేశ్, డి.రాజా చేతులమీదుగా కంటివెలుగు రెండో విడతను ప్రారంభిస్తారు. లంచ్ తర్వాత బహిరంగ సభలో వీరు పాల్గొంటారు. ఇంత మంది జాతీయ నేతలు వస్తున్నందున.. జాతీయ మీడియా ఈ సభకు ప్రాధాన్యం ఇస్తుందని బీఆర్ఎస్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.