మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ఇద్దరు బీజేపీ కీలక నేతలు డీకే అరుణ, జితేందర్ రెడ్డిలు తమ వారసులను రాజకీయ అరంగేట్రం చేయించేందుకు పావులు కదుపుతున్నారు. ఇందుకోసం ఇప్పటి నుంచే వారికీ నియోజకవర్గాలపై పట్టు సాధించి పెట్టేందుకు ఈ ఇద్దరు నేతలు ప్రయత్నాలు చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అయితే, తమతోపాటు తమ వారసులకు టికెట్లు ఇప్పించుకొని పార్టీలో ప్రాబల్యం పెంచుకోవాలని చూస్తోన్న ఈ ఇద్దరి నేతల ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా..?
డీకే అరుణ తన కూతురు స్నిగ్ధారెడ్డిని వచ్చే ఎన్నికల్లో గద్వాల నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. తను మహబూబ్ నగర్ పార్లమెంట్ నుంచి పోటీ చేయాలనే తలంపుతోనున్న గద్వాల జేజెమ్మ.. తన కూతురిని మాత్రం తన ఇలాకా గద్వాల నుంచి బరిలో నిలపాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు చేస్తున్నారన్న టాక్ గద్వాల పొలిటికల్ సర్కిల్లో చాన్నాళ్ళుగా చక్కర్లు కొడుతోంది. అదేవిధంగా..మహబూబ్ నగర్ మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కూడా తన తనయుడు మిథున్ రెడ్డిని వచ్చే ఎన్నికల్లో షాద్ నగర్ నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు. ఇందుకోసం ఆయనను షాద్ నగర్ లో వరుస పర్యటనలు చేయిస్తున్నారు. రహస్య సమావేశాలు నిర్వహిస్తున్నారన్న వాదనలు వస్తున్నాయి.
పార్లమెంట్ ఎన్నికలకు ముందే అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. దాంతో తమ వారసుల గెలుపు తామే తీసుకొని గెలిపించుకుంటామని ఈ ఇద్దరు నేతలు అధిష్టానానికి చెప్పారని.. కాకపోతే ఈ ఇద్దరికీ హైకమాండ్ నుంచి ఆశించిన సమాధానం రాలేదని సమాచారం. గద్వాల నుంచి కూతురిని బరిలో నిలిపి.. మహబూబ్ నగర్ పార్లమెంట్ స్థానం నుంచి మరోసారి పోటీ చేయాలనుకుంటున్న డీకే అరుణకు అధిష్టానం షాక్ ఇచ్చినట్లు సమాచారం.అలాగే, షాద్ నగర్ నుంచి మిథున్ రెడ్డిని పోటీలో నిలిపి అదే మహబూబ్ నగర్ లోక్ సభ స్థానం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు జితేందర్ రెడ్డి.
ఈ విషయమై అధిష్టాన పెద్దలకు చెప్పగా.. పార్టీలో ఒకరికే టికెట్ అని తేల్చి చెప్పినట్లు సమాచారం. ఇద్దరికీ టికెట్లు ఇవ్వడం కుదరదని.. వారసులకు అవకాశం ఇప్పించుకుంటారో లేదా మీరే బరిలో నిలుస్తారో డీకే అరుణ, జితేందర్ రెడ్డిలకు హైకమాండ్ పెద్దలు తేల్చి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడు బంతి ఈ సీనియర్ నేతల కోర్టులోనే ఉంది. మరి వారు తప్పుకొని వారసులకు లైన్ క్లియర్ చేస్తారా..? వారే పోటీలో ఉంటారా..? అనేది వేచి చూడాలి.