తేల్చిన జస్టిస్ సిర్పూర్కర్ కమిషన్
సుప్రీంకోర్టుకి నివేదిక సమర్పించిన కమిషన్
పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారు
10 మంది పోలీసులపై హత్యానేరం కేసులకి సిఫార్సు
దేశవ్యాప్తంగా సంచలనం రేపిన దిశ ఎన్ కౌంటర్ కేసు.. తెలంగాణ పోలీసుల మెడకు చుట్టుకుంది. ఎన్ కౌంటర్ బూటకమని జస్టిస్ వి.ఎస్. సిర్పూర్కర్ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ ఘటనలో పాల్గొన్న పోలీసులు చట్టపరమైన నిబంధనలు, పోలీసు మాన్యువల్ రూల్స్ ను అతిక్రమించారని తెలిపింది. ఈ మేరకు 387 పేజీల నివేదికను సుప్రీంకోర్టుకి సమర్పించింది. నిందితులు పారిపోయేందుకు ప్రయత్నిస్తూ, తమపై దాడి చేశారన్న పోలీసుల వాదనలో నిజం లేదని పేర్కొంది. నిందితులు పోలీసుల నుంచి తుపాకులు లాక్కునేందుకు యత్నించారనడం కట్టుకథలాగే ఉందని, ఈ విషయంలో పోలీసులు చెప్పినవేవి నమ్మశక్యంగా లేవని పేర్కొంది. ఈ ఘటనలో పాల్గొన్న 10 మంది పోలీసులపై హత్యానేరం కింద విచారణ జరపాలని కమిషన్ అభిప్రాయపడింది.
సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం 2019 డిసెంబర్ 6వ తేదీన దిశ నిందితులని పోలీసులు చటాన్ పల్లి తీసుకెళ్లారు. ఈ సమయంలో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, రాళ్లతో దాడి చేశారని, తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారని, ఆత్మరక్షణలో భాగంగానే వారిపై కాల్పులు జరపాల్సి వచ్చిందని పోలీసులు ఇచ్చిన వివరణ నమ్మశక్యంగా లేదని కమిషన్ పేర్కొంది. నిందితులని చంపాలనే ఉద్దేశంతోనే పోలీసులు కాల్పులు జరిపారని అభిప్రాయపడింది. 10 మంది పోలీసులు… వి. సురేందర్, కే నరసింహారెడ్డి, షేక్ లాల్ మదర్, మహ్మద్ సిరాజుద్దీన్, కొచ్చేర్ల రవి, కే వెంకటేశ్వర్లు, ఎస్ అరవింద్ గౌడ్, డీ జానకీరామ్, ఆర్ బాలు రాథోడ్, డీ శ్రీకాంత్ లపై హత్యానేరం కేసులు నమోదు చేయాలని కమిషన్ సిఫారసు చేసింది.
2019 నవంబర్ 28న దిశపై అత్యాచారం చేసి హత్య చేశారు. చెన్న కేశవులు, జొళ్లు శివ, జొళ్లు నవీన్, మహ్మద్ ఆరీఫ్ లను నిందితులుగా గుర్తించిన పోలీసులు వారిని అరెస్టు చేశారు. 2019 డిసెంబర్ 6న సీన్ రీ కన్ స్ట్రక్షన్ కోసం ఘటన జరిగిన చటాన్ పల్లికి తీసుకొచ్చారు. ఈ క్రమంలో నిందితులు తప్పించుకునేందుకు ప్రయత్నించారని, తుపాకులు లాక్కుని కాల్పులు జరిపారని, దీంతో తాము కూడా కాల్పులు జరపాల్సి వచ్చిందని, ఈ ఫైరింగ్ లో నిందితులు నలుగురు చనిపోయారని పోలీసులు అదే రోజు మీడియాకు వెల్లడించారు.
ఎన్ కౌంటర్ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, నివేదిక సమర్పించేందుకు డిసెంబర్ 12న జస్టిస్ సిర్పుర్కర్ నేతృత్వంలో ముగ్గురు సభ్యుల కమిషన్ ను సుప్రీం కోర్టు ఏర్పాటు చేసింది. 2020 ఫిబ్రవరి మొదటి వారంలో కమిషన్ విచారణ ప్రారంభించింది. దిశ తల్లిదండ్రులు, నిందితులు కుటుంబ సభ్యులు, పోలీసులు, సాక్షులు, పోలీసులకి చికిత్స చేసిన వైద్యులను విచారించింది. పోలీసులు, సాక్షులని క్రాస్ ఎగ్జామిన్ చేసింది. అందరి వివరణలు, సాక్ష్యాలను పరిశీలించిన తర్వాత, పూర్తి స్థాయి నివేదిక సిద్ధం చేసిన కమిషన్… ఎన్ కౌంటర్ బూటకమని తేల్చింది. నిందితులపై పోలీసులు ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపారని అభిప్రాయపడుతూ… పోలీసులపై హత్యానేరం కింద కేసులు నమోదు చేయాలని సుప్రీంకోర్టుకి సిఫార్సు చేసింది.