రాజకీయ అరంగేట్రంపై టాలీవుడ్ బడా నిర్మాత దిల్ రాజ్ సంచలన ప్రకటన చేశారు. పార్టీలో చేరాలని ఆఫర్లు వస్తున్నాయని స్పష్టం చేశారు. అయితే..రాజకీయాలపై ఇప్పుడే నిర్ణయం తీసుకోలేనని చెప్పిన దిల్ రాజ్ రాజకీయాల్లోకి రావడం మాత్రం పక్కా అనే సంకేతాలు ఇచ్చారు. తాజాగా ఆయన మాటలు చూస్తే అదే అనిపిస్తోంది.
దిల్ రాజ్ స్వస్థలం నిజామాబాద్. అక్కడే పుట్టి పెరిగిన దిల్ రాజ్ ఆ తరువాత హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. ప్రస్తుతం టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ నిర్మాతల్లో టాప్ లిస్టులో ఉన్నారు. హైదరాబాద్ లోనే సెటిల్ అయినప్పటికీ నిజామాబాద్ తో అనుబంధాన్ని తెంచుకోలేదు దిల్ రాజ్. అందుకే వీలు చిక్కినప్పుడల్లా నిజామాబాద్ వెళ్తుంటారు. గత కొంతకాలంగా నిజామాబాద్ లో ఆయన సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లోకి రావాలనే ఆలోచనతోనే దిల్ రాజ్ సేవా కార్యక్రమాలు మొదలెట్టారనే ప్రచారం జరుగుతోంది.
‘బలగం’ వంటి చిన్న సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న దిల్ రాజ్ ప్రస్తుతం ఈ సినిమా ఇచ్చిన హిట్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లోకి రావాలని ఆఫర్ వచ్చిందని కానీ పోలిటికల్ అరంగేట్రంపై నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశారు. దిల్ రాజ్ చేసిన వ్యాఖ్యలతో ఆయన రాజకీయాల్లోకి రావడం పక్కా అనేది అర్థం అవుతోంది.
ఇటీవల బలగం సినిమా ప్రమోషన్ లో భాగంగా సిరిసిల్లకు వచ్చిన దిల్ రాజును స్వయంగా కేటీఆర్ రాజకీయాల్లోకి రావాలని ఆహ్వానించారు. అప్పుడు కూడా నవ్వి ఊరుకున్న దిల్ రాజు కేటీఆర్ ఆహ్వానంపై స్పందించలేదు. కానీ ఇప్పుడు స్పందించడంతో పార్టీ, పోటీపై ఆయన నిర్దిష్టమైన వైఖరితో ఉన్నట్టు తెలుస్తోంది. దిల్ రాజ్ నిజామాబాద్ ఎంపీ సీట్ ఆశిస్తున్నారు.
నిజామాబాద్ నుంచి బీఆర్ఎస్ తరుఫున కవిత, బీజేపీ నుంచి ధర్మపురి అరవింద్ లు పోటీలో ఉండనున్నారు. కవితను కాదని బీఆర్ఎస్ దిల్ రాజ్ ను బరిలో నిలిపే అవకాశం లేదు. ఈ లెక్కన చూస్తే దిల్ రాజుకు సొంత జిల్లాలో సీటు దక్కడం కష్టమే. అందుకే కొద్దిరోజులు వేచిచూద్దాం అన్నట్టుగా దిల్ రాజు చూస్తున్నాడు. అందుకే ఆయన రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే ఏమి చెప్పలేనని వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది.