తెలంగాణ కాంగ్రెస్ లో ఏర్పడిన సంక్షోభాన్నికి ముగింపు పలికేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ పార్టీ సీనియర్ నేతలకు షాక్ ఇచ్చారు. పార్టీలో జూనియర్లు , సీనియర్లు ఉండరని అందరూ సమానమేనని.. సీనియర్ నేతల వాదనను వీగిపోయేలా బదులిచ్చారు.
పార్టీలో జూనియర్ అయిన రేవంత్ కింద తాము పని చేయడం ఏంటని సీనియర్ నేతలు ఉద్దేశ్యపూర్వకంగా రచ్చ చేస్తున్నారు. ఆయన చెప్పినట్టు నడుచుకుంటే తమకు గౌరవమేమి ఉంటుందని తోచిన విధంగా మాట్లాడారు. రేవంత్ రెడ్డిని పీసీసీగా మార్చాలని పరోక్షంగా వ్యాఖ్యానించారు. కాని సీనియర్లను బుజ్జగించేందుకు వచ్చిన దిగ్విజయ్ సింగ్ మాత్రం.. పార్టీలో జూనియర్, సీనియర్ అనే తారతమ్యం ఉండదని.. అందరూ ఒకటేనని తేల్చి చెప్పి సీనియర్ల నోరు మూయించారు.
రేవంత్ నాయకత్వంలో నచ్చితే ఉండండి.. లేదంటే లేదని చెప్పినట్లుగా దిగ్విజయ్ సింగ్ అభిప్రాయం ఉంది. పార్టీలో విబేధాలను పరిష్కరించేందుకు వచ్చిన డిగ్గీ రాజా అందరితో సమావేశమయ్యారు. ఒక్కొక్కరి అభిప్రాయాలను విడివిడిగా తెలుసుకున్నారు. పీజేఆర్ కుమారుడిని కూడా కలిశారు. తాను చెప్పాలనుకున్నది చెప్పారు. అన్ని సమస్యలు పరిష్కారం అవుతాయని..ఎవైన సమస్యలు ఉంటె హైకమాండ్ దృష్టికి తీసుకురావాలి తప్పితే బహిరంగంగా మాట్లాడవద్దని సీనియర్ నేతలకు సూచించారు.
పార్టీ పరువును మంటగలిపెలా మాటలు తూలితే ఊరుకునేది లేదని హెచ్చరించినట్లుగా తెలుస్తోంది. అయితే, దిగ్విజయ్ సింగ్ పర్యటనతో తమ వాదనను గట్టిగా వినిపించి.. రేవంత్ ను బలిపశువును చేయాలనుకున్న సీనియర్ల పాచికలు పారలేదు. రేవంత్ రెడ్డికి క్లాస్ పీకుతారని.. ఇంచార్జ్ ఠాగూర్ ను మార్చేస్తారని గంపెడు ఆశలు పెట్టుకున్న సీనియర్లకు డిగ్గీరాజా ఇచ్చిన సమాధానంతో షాక్ కొట్టినంత పని అయింది. ఇప్పుడు సీనియర్లు ఏం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.