ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కేసీఆర్ వెనక ముందు చూసుకోకుండా వ్యవహరించారు. గంటల కొద్ది వీడియోపుటేజ్ లను మీడియా సమావేశం ఏర్పాటు చేసి విడుదల చేశారు. వాటిని ముఖ్యమంత్రులకు, చీఫ్ జస్టిస్ లకు, సుప్రీంకోర్టుకు పంపుతున్నట్లు చెప్పారు.ఇదే ఆయనకు కష్టాలు తెచ్చిపెట్టింది.
ఈ కేసు సీబీఐ చేతుల్లోకి వెళ్తుండటంతో ప్రభుత్వ పెద్దలు ఆందోళన చెందుతున్నారు. తాము సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని కోర్టులో చెప్పుకోవాల్సి వస్తోంది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసుపై హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుపై ప్రభుత్వం డివిజనల్ బెంచ్ ముందు అప్పీల్ కు వెళ్ళింది. ఈ అప్పీల్ పై విచారణ సందర్భంగా ప్రభుత్వం తరపు న్యాయవాది అసలు కేసీఆర్ సాక్ష్యాలు రిలీజ్ చేయలేదని చెప్పడానికి ప్రాధాన్యం ఇచ్చారు. గతంలో పైలెట్ రోహిత్ రెడ్డి సాక్ష్యాలు ఇచ్చానని చెప్పారు. ఇప్పుడు మాత్రం ప్రభుత్వ తరుఫు న్యాయవాది అలా జరగలేదని చెప్తుండటం గమనార్హం.
కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కోర్టుకు సరైన సమాచారం అందించలేకపోయారని చెప్పారు. సీఎం ప్రెస్ మీట్ కు ముందే ఆ వీడియోలు పబ్లిక్ డొమైన్ లోకి వచ్చిన విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి మీడియా సమావేశాన్ని సాకుగా చూపి ఈ కేసును సీబీఐకి ఇవ్వడం సమంజసం కాదని వాదించారు. అయినా, ప్రభుత్వాన్ని కూలదోసే కుట్ర జరుగుతున్నప్పుడు ఆ విషయాన్ని ప్రజల ముందు ఉంచడం అయన బాధ్యత అని, అందుకే మీడియా సమావేశం ఏర్పాటు చేశారని వాదించారు.
ఈ కేసు అటు, ఇటు తిరిగి కేసీఆర్ , పోలీసు ఉన్నాతాధికారుల మెడకు చుట్టుకుంటుందని న్యాయ నిపుణులు హెచ్చరిస్తోన్న నేపథ్యంలో పబ్లిక్ డొమైన్ లో ఉన్న వాటిని కేసీఆర్ రిలీజ్ చేశారని , ఆయనకు ఆ వీడియోలను ఎవరూ ఇవ్వలేదని చెప్తున్నారు. ఈ కేసుపై శుక్రవారం కూడా వాదనలు జరగనున్నాయి.