వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ ఎందుకు ఇవ్వకూడదో తెలంగాణ హైకోర్టులో సీబీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. ఈ ఆఫిడవిట్ పబ్లిక్ డొమైన్ లో ఉంది. ఇందులో పలు విషయాలను పేర్కొన్న సీబీఐ… నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల ఫోన్ అంశాలను ప్రస్తావించకపోవడం చర్చనీయాంశం అవుతోంది.
వివేకా హత్య జరగడానికి ముందు ఆ తరువాత జరిగిన ఫోన్ కాల్స్ పై సీబీఐ ఓ స్కెచ్ వేసింది. అందులో అవినాష్ రెడ్డి మాట్లాడిన నవీన్, కృష్ణమోహన్ రెడ్డి అనే వ్యక్తుల ఫోన్ నెంబర్ల వివరాలను ప్రస్తావించలేదు. వివేకా హత్య జరిగిన వెంటనే అవినాష్ రెడ్డి హైదరబాద్ కు కాల్ చేశారు. హైదరాబాద్ లోని జగన్ నివాసంలో పని చేసే నవీన్, కృష్ణమోహన్ రెడ్డిలకు ఫోన్ చేశారు. ఈ అంశంపై సీబీఐ వారిద్దరిని పిలిచి ప్రశ్నించింది. ఈ విషయమై అప్పట్లో సజ్జల స్పందించారు. వారి ఫోన్లకు అవినాష్ రెడ్డి ఫోన్ చేశారని.. వివేకా చనిపోయిన విషయాన్ని జగన్ కు చెప్పేందుకే ఫోన్ చేశారని.. ఇది తప్పేలా అవుతుందని అప్పట్లో సజ్జల ప్రశ్నించారు.
అంటే వివేకా హత్య జరిగిన తరువాత అవినాష్ రెడ్డితో జగన్ , భారతి రెడ్డిలు మాట్లాడారని సజ్జల చేసిన కామెంట్స్ తో స్పష్టత వచ్చింది. అసలు నిందితులు ఎవరో తేల్చే పనిలో నున్న సీబీఐ…తాజాగా దాఖలు చేసిన అఫిడవిట్ లో ఈ ఫోన్ కాల్స్ అంశాన్ని ఎందుకు పక్కనపెట్టేసింది.? అనేది అందరి ప్రశ్న. తెలంగాణ హైకోర్టులో సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ లో పేర్కొనలేదు. స్కెచ్ల రూపంలో చూపించిన దాంట్లో వీరి ఫోన్ కాల్స్ విషయం ఎక్కడ లేదు. ఇది న్యాయవర్గాలను సైతం విస్మయానికి గురి చేస్తోంది.
అవినాష్ రెడ్డి బెయిల్ తిరస్కరించాలని దాఖలు చేసిన పిటిషన్ లలో ఇతర అంశాలను ప్రస్తావించకూడదనే ఈ ఫోన్ నెంబర్ల విషయాన్ని పక్కనపెట్టేశారని చెబుతున్నారు. అది ఎంతవరకు కరెక్టో తెలియదు కానీ నవీన్, కృష్ణమోహన్ రెడ్డిల ఫోన్ నెంబర్ల విషయాన్ని మిస్ చేయడం చర్చనీయాంశం అవుతోంది.