ఏపీని వదిలేసి తెలంగాణలో వైఎస్ షర్మిల రాజకీయం చేయడానికి కారణం భయమేనా..? తన చిన్నాన్న వైఎస్ వివేకా హత్య తరువాత షర్మిలకు పరోక్షంగా ఆ తరహ బెదిరింపులు వచ్చి ఉంటాయా..? ఫ్యాక్షన్ రాజకీయాలను వదిలేసి..ప్రశాంతంగా రాజకీయాలు చేయాలనే నిర్ణయం తీసుకొనే షర్మిల తెలంగాణకు మకాం మార్చారా..? అంటే అవుననే అంటున్నాయి రాజకీయ వర్గాలు.
ఏపీలో జగన్ ను కాదని వైఎస్ షర్మిల పార్టీ పెడితే కొద్దోగొప్పో అయినా అక్కడ నిలదొక్కుకునేవారు. వైఎస్ సన్నిహిత నేతలు , కాంగ్రెస్ నేతలు, ఇతర పార్టీలోని అసంతృప్తులు షర్మిల వెంట నడిచేవారు. పరిస్థితులు కొంత అనుకూలిస్తే అక్కడ సీఎం అయ్యే అవకాశం కూడా షర్మిలకు మెండుగానే ఉంది. కానీ ఈ ఈజీ ప్రాసెస్ ను కాదనుకొని షర్మిల తెలంగాణలో రాజకీయం చేయడంపై చాలామందికి అనేక సందేహాలు ఉన్నాయి. అన్న జగన్ తో ఆస్తుల గొడవలని.. మరొకటని ఏదేదో చెప్పారు. కానీ వివేకా హత్య కేసును తవ్వుతున్న కొద్ది…ఈ కేసుతో షర్మిల రాజకీయానికి సంబంధం ఉందని తెలుస్తోంది.
షర్మిలకు కడప ఎంపీ టికెట్ కోసం వివేకా పట్టు
వివేకా హత్య కేసులో సునీల్ యాదవ్ కు బెయిల్ ఇవ్వొద్దని సీబీఐ దాఖలు చేసిన అఫిడవిట్ ను సునిశితంగా గమనిస్తే పూర్తి విషయాలు అర్థం కావడంతోపాటు మరికొన్ని అనుమానాలకు సమాధానం కూడా దొరికే అవకాశం ఉంది. కడప ఎంపీ టికెట్ అవినాష్ రెడ్డికి ఇవోద్దని వివేకా పట్టుబట్టారని…అవినాష్ కు కాకుండా షర్మిలకు కడప టికెట్ ఇవ్వాలని కోరారని సీబీఐ చెబుతోంది. కడప లోక్ సభ స్థానం నుంచి పోటీ చేయించేందుకు షర్మిలను వివేకా ఒప్పించారని సీబీఐ అఫిడవిట్ లో పేర్కొంది.
షర్మిల రాజకీయంతో తన ఉనికికి ప్రమాదకరమని జగన్
షర్మిల మొదటి నుంచి రాజకీయంగా ఆసక్తితో ఉన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు పార్టీకి అన్ని తానై వ్యవహరించారు. పాదయాత్ర చేశారు. ఆమెకు ఎంపీ టికెట్ ఇస్తామని ప్రామిస్ చేశారు. అధికారంలోకి వచ్చాక రాజ్యసభ అన్నారు. అధికారంలోకి వైసీపీ వచ్చింది కానీ షర్మిలకు ఏ పదవి దక్కలేదు. షర్మిలకు ఏదైనా పదవి ఇస్తే పార్టీలో ఆమె పవర్ సెంటర్ అవుతారనే భయంతోనే ఆమెను దూరం పెట్టారన్న ప్రచారం ఉంది. జగన్ రాజకీయ వ్యూహాలు అలాగే ఉంటాయి మరి.
షర్మిలకు బెదిరింపులు వచ్చాయా..?
షర్మిలను రాజకీయాలకు దూరంగానే ఉంచాలనేది జగన్ అభిప్రాయం. కానీ వివేకా మాత్రం షర్మిలను రాజకీయంగా ప్రోత్సహించాలని పట్టుబట్టారు. ఇది జగన్ కు సహజంగానే నచ్చలేదని అంచనా వేస్తున్నారు. వివేకా హత్యకు గురయ్యే ముందు రోజు టికెట్ల అంశంపై లోటస్ పాండ్ వచ్చి చర్చించి పులివెందుల వెళ్ళారు. ఆ తరువాత ఒక రోజు వ్యవధిలోలోనే ఆయన హత్యకు గురయ్యారు. షర్మిల మాత్రం సైలెంట్ అయ్యారు. ఈ హత్యకేసులో షర్మిల , జగన్ అభిప్రాయాలు వేర్వేరుగా ఉన్నాయి. ఇద్దరి మధ్య విబేధాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇది కూడా పలు అనుమానాలు లేవనేత్తుతోంది. చివరికి షర్మిల ఏపీని వదిలేసి తెలంగాణలో రాజకీయం చేసుకుంటున్నారు. ఆమెకు పరోక్ష బెదిరింపులు రావడంతోనే రాజకీయ రణస్థలాన్ని ఏపీ నుంచి తెలంగాణకు మార్చిందన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.