తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రానున్నారా..? ఇందుకు సంబంధించి ముందస్తు వ్యూహంలో భాగంగానే కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారా..? అంటే అవుననే సమాధానం వస్తోంది.
తెలంగాణ డీజీపీ మహేందర్ రెడ్డి వచ్చే నెలలో రిటైర్ అవ్వనున్నారు. తరువాత ఆయన రాజకీయాల్లోకి వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రారంభోత్సవం సందర్భంగా కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇందుకు ఊతమిచ్చేలా ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ సృష్టికర్త మహేందర్ రెడ్డి అంటూ ఆయనను ఆకాశానికి ఎత్తేశారు. ఈ సమయంలోనే మహేందర్ రెడ్డి రిటైర్మెంట్ గురించి ప్రస్తావిస్తూ… ఆయన రిటైర్ అయ్యాక మహేందర్ రెడ్డి సేవలను మరోలా వాడుకుంటామని చెప్పారు. ఆయన్ను వదిలే ప్రసక్తే లేదని వ్యాఖ్యానించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తె ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమని అర్థం అవుతుంది.
అయితే, ఆయన రాజకీయాల్లోకి వస్తారా..? లేదా..? అనే దానిపై జోరుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ కేసీఆర్ ఆయన్ను టీఆర్ఎస్ లో చేరాలని ఆహ్వానిస్తే.. ఆయనకు ఎలాంటి పదవి కట్టబెడుతారని పొలిటికల్ సర్కిల్లో చర్చించుకుంటున్నారు. ఇదివరకు పదవి విరమణ చేసిన పలువురు ఉన్నాతాధికారులకు కేసీఆర్ నామినిటెడ్ పదవులను కట్టబెట్టారు. సిద్ధిపేట కలెక్టర్ గా పని చేసిన వెంకట్రామి రెడ్డితో పదవికి రాజీనామా చేయించి ఎమ్మెల్సీగా బరిలో నిలిపారు. చీఫ్ సెక్రటరీ లుగా పని చేసిన అధికారులను ప్రభుత్వ సలహాదారులుగా నియమించారు. దీంతో మహేందర్ రెడ్డి సేవలను మరోలా వాడుకుంటామన్న కేసీఆర్.. ఆయనకు ఎలాంటి పదవి కట్టబెడుతారన్నది హాట్ టాపిక్ గా మారింది.
డిసెంబర్ లో డీజీపీగా రిటైర్ అవ్వనున్న మహేందర్ రెడ్డి రాజకీయాల్లోకి రావడం ఖాయమని…ఆయనకు నామినేటెడ్ పదవి లేదా వచ్చే ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు సంబంధించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.