తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన టాప్ మోస్ట్ హైప్రొఫైల్ కేసులు చల్లబడిపోయాయి. తెలంగాణలో ఢిల్లీ మద్యం కుంభకోణం…ఏపీలో వివేకా హత్య కేసుల్లో విచారణ సంస్థల దూకుడు తగ్గింది. ఇటీవల ఈ రెండు కేసుల్లో విచారణ సంస్థల దూకుడుతో ఇక అరెస్ట్ లు ఖాయమని అనుకుంటున్నా నేపథ్యంలోనే దర్యాప్తులో వేగం తగ్గింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో మూడుసార్లు విచారణకు పిలిచిన కవితను ఈడీ దాదాపు తొమ్మిదిగంటలపాటు ప్రశ్నించింది. ఆమె ఫోన్ ను కూడా ఈడీ సీజ్ చేసింది. దాంతో ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవితను అరెస్ట్ చేస్తారని పెద్దఎత్తున ప్రచారం జరిగింది కాని ఆమెను విచారించి వదిలేశారు. మళ్ళీ పిలుస్తామని లీకులు ఇస్తున్నా అలాంటి సూచనలు కనిపించడం లేదు. తరువాత విచారణకు రావాలని ఈడీ నోటిసులు ఇచ్చినా కవిత తరుఫు లాయర్ ను పంపే అవకాశం ఉంది.
ఇదిలా ఉండగానే ఏపీలో రాజకీయ రంగు పులుముకున్న హైప్రొఫైల్ కేసు వివేకా మర్డర్ కేసు. ఈ కేసులో విచారణసంస్థల వేగం కూడా మందగించింది. ఇటీవల సీబీఐ ఎస్పీ రాంసింగ్ ఆధ్వర్యంలో విచారణ ఓ కొలిక్కి వచ్చినట్లే కనిపించింది. కానీ ఈ కేసులో నిందితుడి తరుఫు భార్య సుప్రీంకోర్టును ఆశ్రయించడం…దాంతో రాంసింగ్ ను విచారణ అధికారిగా సర్వోన్నత న్యాయస్థానం తప్పించడంతో ఈ కేసు మళ్ళీ మొదటికి వచ్చినట్లే కనిపిస్తోంది.
ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డి సుప్రీంకోర్టు తీర్పుతో తన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా ఉపసంహరించుకున్నారు. ఇప్పుడు ఈ కేసును సీబీఐ కొత్త సిట్ కు అప్పగించారు. ఆరుగురు సభ్యులతో సిట్ నియామకం జరిగింది కానీ సున్నితమైన హైప్రొఫైల్ కేసును కొత్త సిట్ ఎలా డీల్ చేస్తుందన్నది అందరిని ఆలోచనలో పడేస్తోంది.
రాంసింగ్ లాంటి అధికారిపైనే ఎన్నో ఆరోపణలు వచ్చాయి. ఆయనపై కేసులు కూడా పెట్టారు నిందితులు. ఎన్నో రాజకీయ ఒత్తిళ్లను ఎదుర్కొన్నారు. చివరికి ఈ కేసు కీలక దశకు చేరుకుంటున్న వేళ సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు.. కొత్త సిట్ ఏర్పాటుతో ఈ కేసు కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళినట్లేనని మెజార్టీజనం నమ్ముతున్నారు.
మొత్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ , వివేకా కేసుల్లో సీరియస్ నెస్ తగ్గించేశారనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.