FRBM చట్టం.. అంటే – ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ కోసం తీసుకొచ్చిన చట్టం. ఇప్పుడీ చట్టాన్నే అడ్డుపెట్టుకొని కేంద్రంలోని బీజేపీ రాష్ట్రాలతో ఆటలు ఆడుతోంది. పరిమితికి మించి దేశంలో అప్పులు చేస్తోన్న మోడీ సర్కార్.. బీజేపీ రూలింగ్ లో లేని రాష్ట్రాల్లో మాత్రం ఆర్థిక వనరుల సేకరణకు అడ్డుపడుతూ అభివృద్ధికి మోకాలడ్డుతోంది. తమతో అంటగాకే రాష్ట్రాలకు మాత్రం ఎప్ఆర్బీఎం పరిమితులు చూసీ చూడనట్లు వదిలేస్తూ అప్పులకు అనుమతులు ఇస్తూనే ఉంది. రాజకీయ వైరుధ్యం ఉన్న రాష్ట్రాలకు మాత్రం చిక్కులు పెడుతోంది.
FRBM చట్టం ప్రకారం రాష్ట్రాల అప్పులు జీఎస్డీపీలో 25 శాతానికి మించకూడదు. తెలంగాణ ఆర్థిక గణాంకాల ప్రకారం… రాష్ట్ర మొత్తం అప్పులు సుమారు 4.20 లక్షల కోట్లు. బడ్జెట్ లో పేర్కొన్నవి 2.85 లక్షల కోట్లు కాగా బడ్జెట్ యేతర అప్పులు మరో 1.35 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం అప్పులు కలిపి జీఎస్డీపీలో 36 శాతానికి చేరాయి. అంటే.. ఉండాల్సిన పరిమితి కన్నా 11 శాతం అదనం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ మొత్తం అప్పులు 5.07 లక్షల కోట్లు కాగా బడ్జెట్ లో చూపినవి 3.90 లక్షల కోట్లు, బడ్జెట్ యేతర అప్పులు 1.17 లక్షల కోట్లు. ఏపీ జీఎస్డీపీలో అప్పులు 42 శాతానికి చేరాయి. అంటే… పరిమితి కన్నా 17 శాతం అధికం. మరోవైపు… కార్పొరేషన్ ల ద్వారా తీసుకునే అప్పులను కూడా బడ్జెట్ కింద లెక్కగట్టాలని అన్ని రాష్ట్రాలకు కేంద్రం సూచించింది. వీటి చెల్లింపులు కూడా బడ్జెట్ నుంచే చేస్తున్నారని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రం చెబుతోంది.
“పడని రాష్ట్రాలకు ఇన్ని నీతులు చెబుతున్న కేంద్ర ప్రభుత్వం… ఎఫ్ఆర్బీఎం నిబంధనలు మాత్రం తాను యథేచ్ఛగా ఉల్లంఘిస్తోంది. FRBM చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వ అప్పులు దేశ జీడీపీలో 40 శాతానికి మించరాదు. కానీ ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ మొత్తం అప్పులు 120 లక్షల కోట్లు దాటాయి. ఇవి దేశ జీడీపీలో 51 శాతానికి చేరాయి. ఇలా చట్టాన్ని ఉల్లంఘిస్తోన్న కేంద్రం.. రాష్ట్రాలను మాత్రం అప్పులు చేయొద్దు అంటుంది. ఇది సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం.
ఇటువంటి షరతులు కేవలం కక్ష సాధింపు కోసం కొన్ని రాష్ట్రాలకు (Non BJP Ruled States) మాత్రమే విధించడం అనేది రాజ్యాంగ విరుద్ధం (Article 14). కేంద్ర ప్రభుత్వం ఒకవేళ ఈ నిబంధనల్ని కఠినంగా అమలు చేస్తే వచ్చే 2-3 సంవత్సరాలు కొన్ని రాష్ట్రాలు కొత్త అప్పులు తీసుకోలేవు. దీంతో ఆయా రాష్ట్రాల్లో అభివృద్ధి ఆగిపోతుంది” అని భూములకు శాశ్వత హక్కుల సాధన సమితి నేత గుమ్మి రాజేందర్ రెడ్డి కేంద్ర విధానాలను తప్పుపట్టారు.