శ్రీరామ నవమి రోజు ‘దాసరా’ను చూపిన గొప్ప సినిమా ఇది. అంటే శ్రీరామ నవమికంటే సరదా గొప్ప పండగ అని మా ఉద్దేశం కాదు. శ్రీరామ నవమి అంటే వెజిటేరియన్ పండగ. మటన్, మందు ఉండరు. కానీ దసరాకు మటన్, మందు, జల్సాలు ఉంటాయి. కాబట్టి ఈ రోజు ‘దసరా’ సినిమా ఆక్షన్ అనే మటన్, శృంగారం అనే మందుతో కూడిన మంచి పార్టీ ఇచ్చారు నిర్మాత సుధాకర్ చెరుకూరి. ఇది నిర్మాత సినిమా అనవచ్చు. ఎందుకంటే నాని లాంటి మిడిల్ రేంజ్ హీరోతో చిరంజీవి లాంటి హీరోతో తీయవలసిన భారీ సినిమాను భారీగా తీశారు కాబట్టి.
ప్రపంచంలో 14 కథలు మాత్రమే ఉన్నాయి. అందులోంచి ఇదో కథ. చాలా పాత కథ. కానీ ఎత్తుకున్న నేపధ్యం చాలా కొత్తగా, కన్నుల విందుగా ఉంది. తెలంగాణకు చెందిన గోదావరిఖని తాలూకు వీర్లపల్లి బ్యాక్ గ్రౌండ్ తీసుకునే సరికి సినిమా చాలా ఫ్రెష్ గా, చూడ ముచ్చటగా మొదలవుతుంది. ఈమధ్య మన తెలుగు సినిమా కూడా మలయాళం సినిమాల లాగా సహజ ధోరణిలో వస్తున్నాయి. ఈ కోవలో వచ్చిన ‘పుష్ప’, ‘బలగం’ లాంటి సినిమాలు గొప్ప విజయాలు సాధించాయి. దసరా కూడా అదే స్థాయిలో చాలా సహజంగా ఉంది. గొప్ప విజయం సాధించే అవకాశాలు చాలా ఉన్నాయి.
కథ గురించి
ఇది పేదల కథ. ధరణి (నాని ) సూర్యం (దీక్షిత్ శెట్టి) చిన్నప్పటి నుంచి ప్రాణ స్నేహితులు. ధరణి లవ్ ట్రాక్ లో వెన్నెల (కీర్తి సురేష్) ను ప్రాణంగా ప్రేమిస్తాడు. వెన్నెలను మరో వైపు సూర్యం కూడా ప్రేమిస్తాడు. ఇది తెలిసిన ధరణి తన ప్రేమను చంపుకుని వారిద్దర్నీ కలపడానికి ప్రయత్నం చేస్తాడు.
కానీ సూర్యం చనిపోతాడు. తన స్నేహితుడిని చంపిన వారిపై ధరణి ఎలా పగ తీర్చుకున్నాడు? చివరకు ధరణి – వెన్నెల ఒక్కటి అయ్యారా ? లేదా? ఈ మధ్యలో ధరణి అనుభవించిన మానసిక వేదన ఏమిటి ? అనేది మిగిలిన కథ. కథ కంటే కథను నడిపే బ్యాక్ గ్రౌండ్ గొప్పగా ఉంది.
సినిమాలో లోపాలు
ఈ సినిమాకు దర్శకుడు, రచయిత శ్రీకాంత్ ఓదెల. ఓ దర్శకుడిగా తన విశ్వరూపం చూపాడు. అతనిలో రామ్ గోపాల్ వర్మ, మణిరత్నం లాంటి క్రియేటివ్ దర్శకుడు ఉన్నాడు. కానీ రచయితగా ఫెయిల్ అయ్యాడు. మన దర్శకులకు ఓ రోగముంది. తమిళ సినిమాలు తెగ చూస్తారు. ఆ తమిళ సినిమాల డైలాగ్ ఓరియంటేషన్ కంపును ఒంట పట్టించుకుంటారు. పేజీల కొద్దీ డైలాగులు ఇందులో రాశాడు. ఒక్క పంచ్ పేలలేదు. కాస్తో కూస్తో ఉన్న డైలాగులు కూడా ఎక్కడో విన్నట్లు, ఎక్కడో చదివినట్లు ఉన్నాయి. తెలంగాణ మాండలిక్కాని గొప్పగా వాడుకున్నారు. కానీ చాలా చోట్ల తమిళ్ డబ్బింగ్ సినిమా చూస్తున్న కంపు వాసన వీస్తుంది.
మనం చక్కగా గెడ్డం గీసుకుంటాము. మీసాలు కత్తిరించుకుంటాము. అందరు మెచ్చుకుంటారు. అలాగని మన హెయిర్ కటింగ్ మనమే చేసుకుంటామా? తప్పనిసరి హెయిర్ సెలూన్ కి వెళ్లి కటింగ్ చేయించుకోమా? మనం సొంతంగా జుట్టు కత్తిరించుకుంటే ఎలా ఉంటుందో ఇది అలాగే ఉంటుంది. దర్శకుడు ఓ రచయితను తప్పక పెట్టుకోవాలి. లేనిపోతే సినిమాలో ఎన్ని బొక్కలు ఉండాలో ఇందులో అన్ని బొక్కలు ఉన్నాయి.
అందుకే రాజమౌళి అంటాడు ”ఓ దర్శకుడు తన సినిమాకు కథా, మాటలు రాసుకునే ముందు – రెండు రేడియో నాటకాలు, నాలుగు స్టేట్ నాటికలు, రెండు టి వి డైలీ సీరియళ్లు రాయాలి. అప్పుడే వాటికీ, సిమిమాకు ఉన్న తేడా తెలుస్తుంది. అందుకే నేను వాటి జోలికిపోను” అంటాడు. అందుకే రాజమౌళి ఆస్కార్ స్థాయికి ఎదిగాడు.
ఎడిటింగ్ డల్ గా ఉంది. కొన్ని సీన్లు బోర్ గా ఉన్నాయి. ఆక్షన్ సీన్లు బాగున్నా, వాటి మధ్యలో వచ్చిన మాటలు సోడిగా ఉన్నాయి.
ఇతరుల మాటేమిటి?
నిన్నటి వరకు లవర్ బాయ్ గా కనిపించిన నాని లో ఓ గొప్ప ఆక్షన్ నటుడు కూడా ఉన్నాడు అని రుజువు చేసుకున్నాడు. చిరంజీవి ‘ఖైదీ’ సినిమా లాగా నాని కెరియర్ని మలుపుతిప్పే సినిమా ఇది. దీక్షిత్ శెట్టి నటన గొప్పగా ఉంది. ఇక కీర్తి సురేష్ తన నటనకు ప్రాణం పోసి ‘మహానటి సావిత్రి’ అనిపించుకుంది. ఒకప్పుడు హీరోయిన్ కి మేకప్ వేసి అందం పెంచేవాళ్లు. ఇప్పుడు మేకప్ వేసి అందం తగ్గిస్తున్నారు. ఆమె ఆ డల్ మేకప్ లో కూడా అందంగా కనిపించింది.
ఈ సీమకు కెమరా ప్రాణం. సినిమాటోగ్రఫీ చేసిన సత్యన్ సూర్యన్ హాలీవుడ్ సినిమాను చూపాడు. ఇతర నటి నటులు, సాంకేతిక వర్గం తమ విధులు బాగా నిర్వహించారు. సంగీతం అద్భుతం. అన్ని పాటలు బాగున్నాయి. ఆర్ ఆర్ అద్దిరిపోయింది.
రేటింగ్ ; మొత్తం 5 పాయింట్లకు 3.75 పాయింట్ మేము ఇస్తున్నాము.