పులివెందుల వైసీపీకి కంచుకోట. అక్కడ ఆ పార్టీని ఓడించే శక్తిసామర్ధ్యాలు ఏ పార్టీకి లేవు. కాకపోతే ఇది నిన్నటి మాట. ఇప్పుడు సీన్ మారిపోయింది. పులివెందుల పట్టణంలో వైసీపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయి. వైసీపీకి షాక్ ఇచ్చారు పట్టభద్రులు. ఏపీలో జరిగిన పట్టభద్రుల ఎన్నికల్లో పులివెందుల గ్రాడ్యుయేట్లు టీడీపీకి మద్దతుగా నిలిచారు. పోలైన ఓట్లలో 4323ఓట్లు టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డికి రాగా… వైసీపీ అభ్యర్థి వెన్నుపూస రవీంద్రారెడ్డికి 2120ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇతరులకు 123ఓట్లు వచ్చాయి.
ఈ ఫలితాలను టీడీపీ కూడా ఊహించి ఉండదు. వైసీపీ అసలే ఊహించి ఉండకపోవచ్చు. పట్టభద్రుల ఎన్నికల్లో ఏకంగా రెండు వేల మెజార్టీని టీడీపీకి పులివెందుల పట్టభద్రులు కట్టబెట్టారు. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి పులివెందులకు చెందిన నేత. వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి కర్నూల్ కు చెందిన వారు. స్థానికతను పరిగణనలోకి తీసుకునే పులివెందుల ఓటర్లు టీడీపీకి ఓటేసి ఉండొచ్చునని వైసీపీ శ్రేణులు అభిప్రాయపడుతున్నారు. కానీ వైసీపీపై పట్టభద్రుల ఆగ్రహానికి మరో కారణం కూడా ఉంది.
వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ , అవినాష్ రెడ్డిల తీరు పులివెందుల వైసీపీ నేతలకు కూడా మింగుడు పడటం లేదు. దాంతో వారంతా టీడీపీ అభ్యర్థికి మద్దతు ఇచ్చి ఉండొచ్చుననే అనుమానాలు కల్గుతున్నాయి. నిందితుడి తరుఫున జగన్ ఢిల్లీలో స్థాయిలో లాబియింగ్ చేస్తున్నాడని అనుమానిస్తున్నారు. చెల్లి సునీతకి జగన్ అన్యాయం చేస్తున్నాడని ఆ పార్టీ నేతలు, సానుభూతిపరులు జగన్ పై ఆగ్రహంతో ఉన్నారు. ఈ ఆగ్రహం పట్టభద్రుల ఎన్నికల్లో ప్రస్పుటమైందని అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుఫున వివేకా కూతురు సునీత పోటీ చేస్తుందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి చూచాయగా చెప్పుకొచ్చారు. ఇదంతా కుట్ర అన్నట్లు మాట్లాడారు. నిజంగానే వివేకా కూతురు పులివెందుల నుంచి బరిలో నిలిస్తే వైసీపీ కంచుకోటలో టీడీపీ జెండా ఎగరడం ఖాయమని అనుకోవచ్చు.
Also Read : ఏపీలో అవినాష్ రెడ్డి…తెలంగాణలో కవిత – చెప్పేదేమంటే..?