-కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతిన్న కేసీఆర్
-హస్తం హామీలపై స్పందించేందుకు మల్లగుల్లాలు
- డిక్లరేషన్ పై మాట్లాడకుండా పక్కదారి పట్టించే ప్రయత్నం
-పొలిటికల్ టూరిస్టులు అంటూ అవాకులు, చెవాకులు - కేసీఆర్ మౌనంపై రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ
తెలంగాణలో రైతుల్ని బ్రహ్మాండంగా ఉద్ధరించామని, ఇక దేశంలో రైతుల్ని ఆదుకునే దిక్కు ఒక్క టీఆర్ఎస్సేనని, దేశ రాజకీయాల్ని దున్నేస్తానంటూ నాగలి పట్టుకుని బయల్దేరుతున్న కేసీఆర్… నేల విడిచి సాము చేస్తున్నారు. వాస్తవాల్ని కనుమరుగు చేస్తూ… జాతీయ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. కొత్తగా వచ్చిన ప్రశాంత్ కిశోర్ ఐడియాల మేరకు ఇతర రాష్ట్రాల్లో ప్రజల్ని తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నారు. సరిగ్గా 2014లో మోడీకి ప్రశాంత్ కిశోర్ ఇచ్చిన ఐడియా కూడా అదే కదా. కానీ.. కేసీఆర్ నిజంగా రైతు బంధువా…? వరి వేస్తే ఉరే అన్నడు. బీజేపీతో పంచాయితీ పెట్టుకుని అది రైతుల సమస్య అని మభ్యపెట్టలేదా..? కేసీఆర్ తో పంచాయితీ పెట్టుకున్న బీజేపీ రైతుల్ని బలి తీసుకోలేదా…? ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని కేసీఆర్, మోడీ రైతు బాంధవులు అని చెప్పుకుంటారు…? వరంగల్ లో కాంగ్రెస్ డిక్లరేషన్ లో రైతుల్ని ప్రధాన కేంద్రంగా తీసుకోవడంతో నిజంగా ఎవరు రైతులకు మేలు చేకూర్చే పథకాలు ప్రవేశపెట్టగలరు….? అనే చర్చ విస్తృతంగా జరుగుతోంది.
ఎత్తుకున్న పథకాలెన్ని… ఎత్తేసిన పథకాలెన్ని..?
రైతులకు రావాల్సిన అన్ని హక్కుల్ని టీఆర్ఎస్ సర్కారు కాలరాసింది. పంట బీమా, పరిహారం, యాంత్రీకరణ రాయితీలు ఎత్తేసి…. కేవలం పంటకు రూ.6వేలు ఇస్తూ చేతులు దులుపుకుంటోంది. రైతులకు రుణమాఫీ హామీ ఏమైనట్టు..? కేసీఆర్ ప్రభుత్వం తొలగించిన వ్యవసాయ పథకాల్ని ప్రస్తావించకుండా… రైతు బంధు ఇస్తున్నారు కాబట్టి… తామే గొప్ప అని చెప్పుకుంటున్నారు. రైతుల మరణాలకు బీమా కల్పిస్తున్నామని చెబుతూనే…. అన్నదాతల మరణాల్ని సహజ మరణాలుగా చిత్రీకరించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు… ప్రభుత్వం పట్ల వ్యతిరేకతను పెంచాయి. పంట కుప్పలపై రైతులు చనిపోతే కూడా ఆదుకోని సర్కారు.. రైతు బంధు ప్రభుత్వం ఎట్లయితది..? కాళేశ్వరం నీళ్ల సంగతి సరే… ప్రాజెక్టులో ఏరులై పారిన అవినీతి ముచ్చట ఎందుకు మాట్లాడరు..? కేంద్ర ప్రభుత్వం ఎందుకు విచారణ జరపదు…? ఇదంతా కూడా టీఆర్ఎస్, బీజేపీ ఆడుతున్న డ్రామాలని జనాలకు అర్థమైంది.
కాంగ్రెస్ డిక్లరేషన్ తో కంగుతున్న కేసీఆర్
తెలంగాణలో అధికారంలోకి వస్తే… రైతులకు ఏం చేస్తారో… కాంగ్రెస్ స్పష్టమైన డిక్లరేషన్ ఇచ్చింది. రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ ప్రకటించింది. రైతులతో పాటు రైతు కూలీలకు రుణాలు ఇస్తామని పేర్కొంది.
ఇందిరమ్మ రైతు భరోసా కింద రైతులకు, కౌలుకు రైతులకు ఎకరాకు రూ.15 వేలు సాయం, ఉపాధి హామీలో నమోదు చేసుకున్న భూమి లేని రైతు కూలీలకు ఏడాదికి రూ.12 వేలు సాయం ప్రకటించింది. రైతుల పంటకు గిట్టుబాటు ధర ఇస్తూ, ప్రతి గింజను కొంటామని, ధరలపైనా ముందే నిర్ణయం తెలిపింది. మూతబడిన చెరకు ఫ్యాక్టరీలను తెరిపిస్తామని, పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని స్పష్టంచేసింది. ఈ హామీలన్నీ ఇప్పుడున్న టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వాలు చేపడితే… కాంగ్రెస్ హామీలకు ఇంత ఆదరణ వచ్చేది కాదు కదా…! ఇంకా పంటల బీమా, ఉపాధి హామీ పథకానికి వ్యవసాయం అనుసంధానం, పోడు భూములపై గిరిజనులకు యాజమాన్య హక్కు, ధరణి పోర్టల్‌ను రద్దు, నకిలీ పురుగు మందులు, విత్తనాలు అమ్మితే పీడీ యాక్ట్ కింద కేసుల నమోదు వంటి నిర్మాణాత్మక హామీల్ని కాంగ్రెస్ డిక్లరేషన్ లో పొందుపర్చింది. పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి, ప్రతీ ఎకరాకు, రైతు కమిషన్ నియమించి, వ్యవసాయాన్ని పండుగ చేస్తామని కాంగ్రెస్ వెల్లడించింది.
నియంత్రిత సాగుపై అన్నదాత కన్నెర్ర
సీఎం కేసీఆర్ ఇష్టారాజ్యంగా, అనాలోచితంగా ప్రకటించిన నియంత్రిత సాగు అన్నదాతల్ని ఆగం చేసింది. గడువు దగ్గర పడుతున్నా… ఏ పంట వేయాలో చెప్పని సర్కారు జాప్యంతో వేలాది మంది రైతులు పంటలు వేయలేని దుస్థితి తెలంగాణలో నెలకొంది. కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇస్తున్నామని గొప్పలు చెప్పుకుంటూనే పంటలు వేసుకోవద్దని చెప్పే హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది..? నల్ల సాగు చట్టాలపై రైతులు ఢిల్లీలో ఉద్యమిస్తున్నప్పుడు… కేంద్రం నియంతృత్వంగా వ్యవహరించింది. రైతుల ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంది. అదే సమయంలో ఢిల్లీ వెళ్లిన కేసీఆర్ మోదీకి, అమిత్ షాకు షాలువాలు కప్పి వచ్చారు. కానీ.. మొన్న ధాన్యం కొనుగోలు కోసం ఢిల్లీ వెళ్లి దీక్ష డ్రామా ఆడారు. మళ్లీ నాలుగు రోజులు గడవకముందే… పంట కొంటానని చెప్పారు. ఇవన్నీ రైతుల్ని ఆగం చేసిన పనులే అని అన్నదాతలు గుర్తించారు.
డిక్లరేషన్ ను ఢీకొట్టేదెలా..?
కాంగ్రెస్ డిక్లరేషన్ తో దిక్కుతోచని పరిస్థితుల్లో పడ్డ సీఎం కేసీఆర్… ఇప్పుడు రైతుల్ని మభ్యపెట్టేందుకు మరో ఎత్తుగడ వేస్తున్నట్టు తెలుస్తోంది. ‘వ్యవసాయ ప్రగతి’ పేరుతో రైతుల వద్దకు వెళ్లాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇన్నాళ్లు ఆగం చేసి, ఇప్పుడు ఆదుకుంటామంటే… జనం కేసీఆర్ ను నమ్మేదెలా..? నల్ల సాగు చట్టాలు ఇంకా అటకెక్కలేదని… సమయం చూసుకుని మళ్లీ తీసుకొస్తామని చెప్పే బీజేపీని విశ్వసించేదెలా..?