ఏపీ మంత్రి అంబటి రాంబాబు నయా దందా స్టార్ట్ చేశాడు. ఎన్నికలు సమీపిస్తున్నాయనో లేక అధికారం ఉండగానే నాలుగు రాళ్ళు వెనకేసుకోవాలనుకుంటున్నారో కాని కక్కుర్తి పనులు మానడం లేదు. ఓ బిడ్డను ప్రమాదంలో కోల్పోయిన తల్లికి వచ్చిన పరిహారంలో సగం డిమాండ్ చేసి వివాదంలో ఇరుక్కున రాంబాబు.. మరో కక్కుర్తికి పాల్పడినట్లు తేలడంతో ఆయనపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది.
సత్తెనపల్లిలో వైఎస్సార్ సంక్రాంతి లక్కీ డ్రా పేరుతో కొత్త స్కీమ్ ను ప్రారంభించారు. వాలంటీర్లను ఉపయోగించి.. ప్రభుత్వ పథకాలు పొందిన వారితో బలవంతంగా టికెట్లు అమ్మించి డబ్బులు వసూళ్లు చేశారు. ఈ తతంగమంతా మంత్రి అంబటి కనుసన్నలో నడిచింది. జనవరి 12న డ్రా నిర్వహించి విజేతలకు డైమండ్ నక్లెస్, రెండు కార్లు, ఒక ట్రాక్టర్, నాలుగు బుల్లెట్లు, ఆరు మోటర్ సైకిళ్లు, 13 ఎల్ఈడీ టీవీలు, 75 మిక్సీలు అందిస్తామని ప్రకటించారు. ఒక్కో కూపన్ ధర వంద రూపాయలుగా నిర్ణయించారు.
లక్కీ డ్రా కూపన్ల ద్వారా సత్తెనపల్లి నియోజకవర్గంలో కోటి రూపాయల వసూళ్లు చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకు సంబంధించి మంత్రి రాంబాబు వాలంటీర్లకు, వైసీపీ కార్యకర్తలకు బుక్ లెట్ అందించారు. అంబటి ఆదేశాలతో వైసీపీ క్యాడర్ ప్రజల్ని బెదిరించి కూపన్లు తీసుకునేలా చేస్తున్నారు. విషయం జనసేన నాయకులకు తెలియడంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మంత్రిపై కేసు అంటే పోలీసులు వెంటనే నమోదు చేస్తారా..? కుదరదుపొండి అన్నారు. దాంతో జనసేన నేతలు కోర్టులో పిల్ దాఖలు చేశారు. ఈ పిల్ ను మంగళవారం విచారించిన జిల్లా కోర్టు మంత్రి రాంబాబుపై వెంటనే కేసు నమోదు చేసి విచారణ చేయాలని పోలీసులను ఆదేశించింది.
ఏపీలో పోలీసులు అంత వైసీపీ నేతలకు మద్దతుదారులుగానే వ్యవహరిస్తారు. కాబట్టి కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేసినా.. విచారణ మాత్రం సవ్యంగా జరిగే అవకాశం లేదని తెలుస్తోంది.