చైనాలో కరోనా రక్కసి మహోగ్ర రూపం దాల్చింది. కోవిడ్ కేసులు కుప్పలు, తెప్పలుగా నమోదు అవుతున్నాయి. అక్కడ నమోదు అవుతోన్న కేసుల సంఖ్యను జిన్ పింగ్ ప్రభుత్వం స్పష్టంగా చెప్పడం లేదు కాని పరిస్థితి దారుణంగా ఉంది. మరణాల సంఖ్య కూడా దాచేస్తోంది. ఈ నేపథ్యంలో లండన్ కి చెందిన ఎయిర్ ఫినిటి లిమిటెడ్ సంస్థ బయటపెట్టిన రిపోర్ట్ ప్రపంచ దేశాల గుండెల్లో వణుకు పుట్టిస్తోంది.
చైనాలో ప్రస్తుతం ప్రతిరోజు 10లక్షలు (1మిలియన్ ) కరోనా కేసులు నమోదు అవుతున్నాయని, 5వేలమంది ప్రాణాలు కోల్పోతున్నారని ఎయిర్ ఫినిటి లిమిటెడ్ సంస్థ అంచనా వేసింది. రానున్న కాలంలో ఈ సంఖ్య మరింత పెరగనుందని తెలిపింది. జనవరిలో 37లక్షలకు చేరుకుంటాయని, మార్చి నాటికీ 42లక్షల కరోనా కేసులు ప్రతిరోజు నమోదు అవుతాయని తాజా నివేదికలో హెచ్చరించింది. చైనా ప్రభుత్వం రోజువారీ కరోనా కేసులను తక్కువ చూపిస్తోందని పేర్కొంది.
చైనా ప్రభుత్వం వెల్లడించిన లెక్కల ప్రకారం చూస్తే… గత 24గంటల్లో దేశంలో 3వేల కేసులు నమోదైతే, ఒక్కరు కూడా కరోనాతో మృతి చెందలేదని పేర్కొంది. జిన్ పింగ్ ప్రభుత్వం కరోనా కేసులు, మరణాలను దాచటంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది. అక్కడ జ్వరం మందులకు కూడా కొరత ఏర్పడిందని ఇప్పటికైనా అక్కడి ప్రభుత్వం వాస్తవ గణాంకాలను వెల్లడించాలని సూచించింది.
నిజానికి , చైనాలో ప్రస్తుత పరిస్థితులు పూర్తిగా అదుపు తప్పాయి. జీరో కోవిడ్ విధాన నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్నాక కరోనా కోరలు చాచి ప్రజలను బలితీసుకుంటుంది. కేసులు రాకెట్ వేగంతో నమోదు అవుతున్నాయి. ఆసుపత్రుల్లో బెడ్ కూడా దొరకని పరిస్థితులు ఉన్నాయి.
బెడ్ కోసం బాధితులు గంటలకొద్ది వెయిట్ చేయాల్సిన పరిస్థితి. అప్పటి వరకు ఆసుపత్రీ ప్రాంగణంలో ఆరు బయట నిరీక్షించాల్సి వస్తోంది. ఈలోపు జరగాల్సిన నష్టం జరుగుతుంది. సాధారణ జ్వరం వస్తే మందులు కూడా లభ్యం కావడం కష్టంగా మారిందంటే చైనాలో పరిస్థితులు ఎంత దారుణంగా మారాయో అర్థం చేసుకోవచ్చు.