చైనాలో కరోనా కల్లోలం కొనసాగుతోంది. అక్కడ 37లక్షల కరోనా కేసులు నమోదు అయ్యాయట. ఇది సరికొత్త రికార్డ్. ఇక కోవిడ్ కేసుల సంఖ్యను ప్రకటించడం కూడా మానేస్తామని చైనా హ్యండ్సప్ చెప్పేసింది.
చైనాకు చెందిన ఓ మీడియా సంస్థ లీక్ చేసిన చైనీస్ డాక్యుమెంట్స్ ప్రకారం గత 20రోజుల్లో 25కోట్ల మంది మంచాన పడినట్లు తేలింది. కాని, జీరో కోవిడ్ ఆంక్షలు ఎత్తేసాక డిసెంబర్ 7తరువాత చనిపోయింది కేవలం ఏడుగురు మాత్రమేనని అంటోంది చైనా. క్షేత్రస్థాయిలో కనిపిస్తోన్న పరిస్థితులు మాత్రం వాస్తవానికి పూర్తి భిన్నంగా ఉన్నాయి.
కొన్ని నగరాల్లో సగానికి పైగా జనాభాను ఆక్రమించేసింది BF7వేరియంట్. ఆసుపత్రుల్లో పడకల్లేవ్. పడకలు దొరికిన ఐసీయూలో ఆక్సిజన్ లేదు. వైరస్ సోకి మరణిస్తే మార్చురీలో స్థలం కూడా లేకుండా పోయిన దీనస్థితి హృదయాలను కలిచివేస్తోంది. అంబులెన్స్ లను కూడా వెనక్కి పంపిస్తున్నారు. సరైన వైద్య సదుపాయాలు లేక రోగులు అల్లాడిపోతున్నారు. నెక్ట్స్ డిసెంబర్ లోగా చైనాలో 20లక్ష మంది చనిపోతారన్నది తాజా అంచనా.
ఇండియాలో BF7 వేరియంట్ అనే ప్రభావం ఉంటుందా..? ఉండదా అనే అనుమానాలు కొనసాగుతుండగా పెరుగుతోన్న కేసులు భయపెడుతున్నాయి. బీ అలర్ట్ అంటూ మన్కీ బాత్ లో హెచ్చరించారు ప్రధాని. ఆదివారం చైనా నుంచి ఆగ్రా వచ్చిన ఓ వ్యక్తిలో BF7 వేరియంట్ బయటపడింది. కోవిడ్ వ్యాప్తికి మరెంతో సమయం పట్టదని కోవిడ్ ఆంక్షలను కట్టుదిట్టం చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది.
చైనా, జపాన్, సౌత్ కొరియా, సింగపూర్ , థాయిలాండ్ నుంచి వచ్చే ప్రతి ప్యాసింజర్ కు ఆర్టీ -పీసీఆర్ టెస్ట్ తప్పనిసరి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో కోవిడ్ పరీక్ష కేంద్రాలు తయారయ్యాయి. అయితే, ఇండియాకు అంత భయం లేదని అంటోంది సీసీఎంబీ.
చైనాను కబళించిన BF7కు అంత సీన్ లేదని, చైనాను షేక్ చేసినంతగా ఇండియాను వణికించలేదని చెప్తున్నారు. మనలో చాలామంది ఇమ్యూనిటీ పెరిగింది. 20శాతం బూస్టర్ డోస్ పడింది. సో, ఈ కొత్త వేరియంట్ వలన ఆందోళన చెందాల్సిన అవసరమేమీ లేదని బేఫికర్ అంటున్నారు నిపుణులు.