ఇండియాలో పెరుగుతోన్న కరోనా కేసులు నాలుగో వేవ్ కు సంకేతమా..? కోవిడ్ విషయంలో ఇండియా అలర్ట్ కాకపోతే కరోనా విలయం తప్పదా…? పెరుగుతోన్న కేసులు ఇదే విషయాన్నీ చెబుతున్నాయా..? అంటే అవుననే అంటున్నారు వైద్య నిపుణులు.
ఇండియాలో కరోనా మరోసారి గేర్ మార్చింది. కరోనా మహమ్మారి ధాటికి ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 85,076 మందికి కరోనా పరీక్షలు చేయగా.. 5880 మందికి పాజిటివ్ అని తేలింది. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 35, 199 కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో మొత్తం 14 మంది కరోనాతో మరణించారు. మృతుల సంఖ్య కూడా పెరుగుతోంది. దీంతో ఇండియాలో మరోసారి కరోనా విలయం తప్పదనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి.
ఇండియాలో నిర్లక్ష్యం ఎక్కువ. కరోనా కేసులు తగ్గుముఖం పట్టగానే ముక్కుకు మాస్క్ కట్టడం మా వల్ల కాదు.. ఇన్నాళ్ళు భరించాం. కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టాక కూడా ఈ మాస్క్ లు ధరించడం ఏంటని ప్రశ్నించేవారు చాలామందే ఉంటారు. పైగా మాస్క్ ధరించేవాళ్ళను చాదస్తం మనుషులంటూ వెటకారంగా మాట్లాడుతుంటారు. కరోనా కల్లోలం ధాటికి అయినవాళ్ళు కళ్ళముందు హాహాకారాలు చేసిన దృశ్యాలు చూసి డేంజరస్ కరోనా విషయంలో అప్రమత్తంగా ఉండేవాళ్ళను అజాగ్రత్త మూడ్ లోకి వచ్చేలా మోటివేట్ చేస్తున్నారు.
ఇలాంటి నిర్లక్ష్యం వలనే రెండో అల, మూడో అల భారత్ ను కకావికలం చేసింది. ఆసుపత్రులన్నీ కిక్కిరిసిపోయేలా చేసింది. ఆసుపత్రిలో బెడ్ దొరకని పరిస్థితులను తయారు చేసింది. గత అనుభవాలు కళ్ళముందు కనిపిస్తోన్నా.. ఆ విషాద విలయం ఇంకా మరిచికపోయినా కరోనా విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. ఈ నిర్లక్ష్యమే ఇప్పుడు భారత్ లో మళ్ళీ కరోనా కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. ప్రపంచ దేశాలు కరోనా నుంచి గుణపాఠాలు నెర్చుకొని కోవిడ్ నియంత్రణకు చర్యలు తీసుకుంటుంటే ఇండియా మాత్రం మళ్ళీ కరోనా చాస్తోన్న కోరల్లో చిక్కేందుకు ఆరాటపడుతున్నట్లు ప్రస్తుత పరిస్థితులు కనిపిస్తున్నాయి.
కరోనా విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా అది నాలుగో అలకు దారితీస్తుందని హెచ్చరిస్తున్నారు వైద్య, ఆరోగ్య నిపుణులు. కేసులు పెరుగుతోన్న దృష్ట్యా కరోనా నిబంధనలను కఠినతరం చేయాలని ప్రభుత్వాలకు సూచనలు చేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం అలర్ట్ అయింది. కరోనా కట్టడికి చర్యలు తీసుకోవాలని అన్ని రాష్ట్రాలకు ఆదేశాలు జరీ చేసింది.
మరోవైపు కరోనాను ఎదుర్కొనేందుకు వీలుగా రెండు రోజులపాటు ఏప్రిల్ 10 ,11 తేదీల్లో దేశ వ్యాప్తంగా మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. కరోనా కేసులు రోజురోజుకు పెరుగుతుండటంతో నాలుగో వేవ్ తప్పదని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా చివరి మ్యూటేషన్ ఓమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇప్పుడు వస్తున్న మరో వేరియంట్ ఎక్స్బీబీ 1.16 వంటి వాటితోనే కేసులు పెరుగుతున్నాయని చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో మాస్కుల వినియోగం చేతులు శుభ్రం చేసుకోవడం సామాజిక దూరం పాటించాలని సూచిస్తున్నారు. ఇప్పటికే మూడు రాష్ట్రాల్లో కేసుల తీవ్రత కారణంగా తిరిగి మాస్కుల వినియోగం తప్పనిసరి చేశారు. విదేశాల నుంచి వచ్చే వారికి పరీక్షలు చేస్తున్నారు. హర్యానాలో పాఠశాలల్లో మాస్కును తప్పనిసరి చేశారు.
Also Read : మళ్ళీ మొదలైన కరోనా టెన్షన్ – హైఅలర్ట్ ప్రకటించిన కేంద్రం