సినిమా వాళ్ళకే కాదు. రాజకీయ నాయకులకు కూడా సెంటిమెంట్ పుష్కలంగా ఉంటాయి. మనకే కాదు చివరికి అమెరికా ప్రెసిడెంట్ బరాక్ ఒబామా కూడా తన జేబులో మన ఆంజనేయుడి కాయిన్ పెట్టుకుని రెండు సార్లు గెలిచాడు. కెసిఆర్ తన కుడి చేతికి పెద్దమ్మ తల్లి రిబ్బన్ కట్టుకుని రెండుసార్లు గెలిచాడు. అలాగే వై ఎస్ రాజశేఖ రెడ్డి కూడా ప్రతి పనిని, ప్రతి పథకాన్ని చేవెళ్ల లో మొదలు పెట్టాడు. చేవెళ్ల చెల్లెమ్మ అని పిలిచే సబితా ఇంద్ర రెడ్డి చేతుల మీదుగా మొదలు పెట్టేవాడు. అన్ని మంచి శకునాలు జరిగాయి.
ఇప్పుడు అదే తోవలో పి సి సి ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కి కూడా సీతక్క సెంటిమెంట్ ఉన్నది. అతను ఏ పని చేసినా ములుగు నుంచి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నారు. అదికూడా సీతక్క చేతుల మీదుగా. ఆ సెంటిమెంట్ ఫలిస్తోంది అనడానికి మొన్న అతను చేపట్టిన పాదయాత్ర ఓ ఉదాహరణ.
కాంగ్రెస్ పార్టీ పని ఐపోయింది, దివాళా తీసిన కాంగ్రెస్ పార్టీ సొంత కార్యకర్తలే ఈ పాద యాత్రలో పాల్గొనరుని బి ఆర్ ఎస్, బి జె పి బహిరంగంగా విమర్శించాయి. కానీ అది అబద్దమని రెండు రోజుల్లో తేలిపోయింది. రేవంత్ పరుగెత్తుతున్న ఈ పాదయాత్రలో జనం తండోపతండాలుగా వస్తున్నారు. వీళ్లు సినిమా జూనియర్ ఆర్టిస్టులు కాదు. డబ్బులిస్తే వచ్చే కూలీలు కాదు. బస్ లు కడితే వచ్చిన ఆవారా గాళ్లు కాదు. అన్నం పొట్లాలు ఇస్తే వచ్చే అలకా జనం కాదు. క్వార్టర్ బాటిల్ ఇస్తే వచ్చే తాగుబోతులు కూడా కాదు. ఆ మాటకొస్తే కాంగ్రెస్ కార్య కర్తలు కూడా కాదు. మరి ఎవరు?
తొమ్మిదేళ్లుగా కేసీర్ పాలనలో మోసపోయిన పీడితులు. కేసీఆర్ దొంగ పథకాలతో దగా పడిన ఆడపడుచులు. ఉద్యోగాలు రాని పట్టభద్రులు. భూములు కోల్పోయిన పేద రైతులు. పోడు భూములు పోయిన పేదలు. ఒక్కప్పుడు ఫ్రెంచ్ విప్లవం కూడా ఇలాగే చిన్న పాదయాత్రతో మొదలయింది. ఉన్న ప్రభుత్వాన్ని మార్చాలి, మునుపటి కాంగ్రెస్ మళ్లీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేయాలనుకునే నిజమైన ఓటర్లు పాదయాత్రలో పాల్గొంటున్నారు.
ఇది చూసి కె సిఆర్ గుండెలో రైళ్లు పరుగెడుతున్నాయి. కాదు…. కాదు… కార్ పరుగెత్తుతోంది . కాదు…కాదు …. ఆ కార్ కు బ్రేకులు పడ్డయి. కాదు … కాదు… ఆ కార్ టైర్ పంచర్ అయింది. కాదు … కాదు…ఆ కార్ లో పెట్రోల్ అయిపోయి బండి షెడ్ కు వచ్చింది. అందుకే కెసిఆర్ ఏడుపు మొదలయ్యింది.
కెసిఆర్ కి మేమే పోటీ అనుకున్న నిన్నటి వరకు చంకలు గుద్దుకున్న బీజేపీ కమలం రంగు వెలవెల పోతోంది. కాదు…. కాదు… కమలం వాడిపోయింది. కాదు…. కాదు… కమలం కుళ్లిపోయింది. కాదు…. కాదు…కంపు కొడుతోంది. ఎంతైనా అది పుట్టింది బురదలోనే కదా!
సూర్యుడి లాంటి కాంగ్రెస్ పడమరలో శాశ్వతంగా వాలిపోయింది అనుకోవడం నిరాశ. మునిగిన సూర్యుడు ఇక మళ్లీ ఉదయించడనుకోవడం దురాశ. మళ్ళీ కాంగ్రెస్ కొత్త రెక్కలు తొడుక్కొని కొత్త ఉత్తేజంతో ముందుకు వస్తోంది.