తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ నే లేకుండా చేస్తారని అనుకోకపోవడం మా తప్పేనని ఎమ్మెల్యే జగ్గారెడ్డి అన్నారు. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం కేసీఆర్ అని విమర్శించారు. కాంగ్రెస్ వార్ రూమ్ ను సీజ్ చేయడంపై జగ్గారెడ్డి స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఎలాంటి నోటిసులు జారీ చేయకుండా మాదాపూర్ లోని కాంగ్రెస్ వార్ కార్యాలయాన్ని పోలీసులు ఎలా సీజ్ చేస్తారని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కంప్లైంట్ కాపీ కూడా చూపించకుండా హార్డ్ డిస్క్ లు, సిబ్బంది ఫోన్లను లాక్కోవడం ఏంటన్నారు. లిక్కర్ స్కాం దర్యాప్తులో భాగంగా కవిత ఇంట్లో సీబీఐ కూర్చోలేదా..? సీబీఐని ఏం పికలేక మాపైన దాడి చేస్తారా అని మండిపడ్డారు. లిక్కర్ స్కామ్ కి మహారాణి కవిత అని ఆరోపించిన జగ్గారెడ్డ కవిత మంచి యాక్టర్ అయ్యిందన్నారు.
ప్రభుత్వ అవినీతిని వెలుగులోకి తీసుకొస్తే తప్పా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు. కొంత మంది పోలీసులను పోలీసులు అనాలా.. ఇంకా ఏమైనా అనాలా అర్థం అవ్వడం లేదన్నారు. వారంతా కేసీఆర్.. కవితలకు ఊడిగం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇప్పుడు కేసీఆర్ అనుకున్నట్లే, ఉద్యమ సమయంలో కేసీఆర్ ను తాము తొక్కియాలనుకుంటే అడ్రస్ లేకుండా పోయుండేవాడని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ నేతలు మాట్లాడోద్దంటే ఎలా అని ప్రశ్నించిన జగ్గారెడ్డి, మా వార్ రూమ్ మీద దాడి చేసుడు ఏందని నిలదీశారు. ఏసీపీ, డీసీపీలు వేసుకునే పొలిసు డ్రస్ కైనా విలువైనా ఇవ్వాలని సూచించారు. గుర్కా నయం వాళ్ళైన పద్దతిగా పని చేస్తారని చురకలు అంటించారు. కల్వకుంట్ల కుటుంబమంతా అవినీతిమాయం అయిందని, కేసీఆర్ ఒంటి నిండా అవినీతి బొక్కలే వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కేసీఆర్.. ఆయన కూతురు ఉంటారా..? అని నిలదీశారు.
కాంగ్రెస్ లేకుండా చేయాలని బీజేపీ, టీఆర్ఎస్ లు కుట్ర చేస్తున్నాయని జగ్గారెడ్డి ఆరోపించారు. వార్ రూమ్ పై దాడి సీరియస్ గా తీసుకుంటామని, కొంతమంది పోలీసు అధికారులకు కాంగ్రెస్ సత్తా ఏంటో చూపిస్తామని హెచ్చరించారు.