వచ్చే ఎన్నికల్లో ఆలేరులో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరడం ఖాయంగా కనిపిస్తోంది. వివిధ సామజిక వర్గాలకు చెందిన వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆలేరు పట్టణం 6వ వార్డుకు చెందిన సుమారు వంద మంది వివిధ పార్టీలకు చెందిన నాయకులు నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ బీర్ల ఐలయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. వీరందరికీ ఆయన కండువా కప్పి కాంగ్రెస్ లోకి ఆహ్వానించారు.
ఏపీకి మాత్రమే పరిమితమైన కుల రాజకీయం తెలంగాణలోనూ పాగా వేయడానికి కేసీఆర్ ప్రధాన కారణమని బీర్ల ఐలయ్య విమర్శించారు. కుల రాజకీయాలు చేస్తూ ప్రజల మధ్య విద్వేషాలను రాజేస్తున్నారన్నారు. దళిత బంధు తరహాలో ఆర్థికంగా,రాజకీయంగా వెనకబడిన వడ్డెర సామజిక వర్గానికి చేయూతనందించడం కోసం వడ్డెరబంధును తీసుకురావాలని ఆయన డిమాండ్ చేశారు. వడ్డెర కులస్తులకు అండగా తాను ఉంటానని వారికీ ఐలయ్య అభయం ఇచ్చారు. స్థానిక ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి వడ్డెరలకు ప్రత్యేకంగా డబుల్ బెడ్ రూమ్ కేటాయింపు కోసం చొరవ చూపాలన్నారు.
టీఆర్ఎస్ ఎనిమిదేళ్ళ పాలనలో అరచేతిలో వైకుంఠం చూపించడం తప్ప చేసిన అభివృద్ధి ఏమి లేదని బీర్ల ఐలయ్య మండిపడ్డారు. ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి ఆలేరును అనాధలా వదిలేసి ఆస్తులను కూడబెట్టుకునేందుకు అధిక ప్రాధాన్యత ఇస్తోందని నిప్పులు చెరిగారు. అనంతరం కాంగ్రెస్ లో కొత్తగా చేరిన నాయకులు మాట్లాడుతూ..రానున్న ఎన్నికల్లో ఆలేరులో బీర్ల ఐలయ్యను భారీ మెజార్టీతో గెలిపించుకునే దిశగా పని చేస్తామని ప్రకటించారు.