వచ్చే ఎన్నికల్లో 40మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ పక్కనపెట్టనున్నారా..? సిట్టింగ్ లందరికీ టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ తాజాగా కేసీఆర్ చేయిస్తోన్న సర్వే ఆధారంగానే టికెట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారా..? ఎమ్మెల్యేలపై ఆశావహులు మాటల దాడి చేస్తుంటే.. కార్యకర్తల ముందే బాహాబాహీకి దిగి తమ బలాన్ని ప్రదర్శిస్తూ ఉంటె అన్ని గమనిస్తోన్న అధినేత ఓ నలభై మందికి క్లారిటీ ఇవ్వబోతున్నారనే అంశాలపై బీఆర్ఎస్ లో జోరుగా చర్చ జరుగుతోంది.
సిట్టింగ్ లకే టికెట్లు ఇస్తామని కేసీఆర్ ప్రకటించినా ఇంటిపోరుతో ఎమ్మెల్యేలు సతమతం అవుతున్నారు. ఇదే సమయంలో లేటెస్ట్ సర్వే ఒకటి ఎమ్మెల్యేలలో గుబులు రేపుతోంది. ఈ సర్వేలో ఎలాంటి ఫలితం వస్తుందోనని ఎమ్మెల్యేలు నియోజకవర్గాల బాట పడుతున్నారు. బీఆర్ఎస్ లో గెలుపు జోష్ కనబడుతోన్న ఎమ్మెల్యేలకు మాత్రం సర్వే ఫీవర్ పట్టుకుంది. ఆరు నెలలకు ఓసారి ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే చేయించే కేసీఆర్ మారిన పరిణామాలతో ఇటీవల ఓ సర్వే చేయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సర్వే ఆధారంగా ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయింపులు ఉండనుందని బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ సర్వేలో పాసైతేనే టికెట్ లేదంటే తీసి పక్కనపెట్టేస్తారట. ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉన్న నియోజకవర్గాలను గుర్తించి అక్కడ టికెట్ ఆశావహులు ఎవరున్నారో తెలుసుకొని వారికి టికెట్ కేటాయించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే ఆశవహులకు అనుకోని వరంగా మారిందన్న డిస్కషన్ జరుగుతోంది.
ఎన్నికలకు ఆరు నెలల ముందుగానే టికెట్లు ప్రకటిస్తానని కేసీఆర్ చెప్పారు. సిట్టింగ్ లనే బరిలో నిలుపుతామని చెప్పారు. కానీ ఇది ఎంతవరకు వాస్తవంలోకి వస్తుందనే అనుమానాలు బీఆర్ఎస్ లో ఉన్నాయి. దీంతో ఆశావహులు తమ ప్రతాపాన్ని చూపుతున్నారు. కేసీఆర్ చేయిస్తోన్న సర్వేలో తమ పేరు ఉండేలా జాగ్రత్తలు పడుతున్నారు. ఇందుకోసం ఏమేం చేయాలో తెలుసుకుంటున్నారు. సిట్టింగ్ లు ఉండగానే తమకే టికెట్ వస్తుందని ఆశావహులు చెప్పుకుంటున్నారు. ఇలా దాదాపు నలభై నియోజకవర్గాల్లో టికెట్ పోరు నడుస్తోంది. ఈసారి ఆరునూరైన టికెట్ దక్కించుకోవాలనే తలంపుతో ఎమ్మెల్యేలతోనే వాదనలకు దిగుతున్నారు.
ఇటీవల మేడ్చల్ జిల్లాలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి మల్లారెడ్డి , మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. తనే మళ్ళీ పోటీ చేస్తానని మల్లారెడ్డి ప్రకటించడంతో అక్కడే ఉన్న సుధీర్ రెడ్డి తప్పుపట్టారు. ఇద్దరు నేతలు మైక్ లు లాక్కునే ప్రయత్నం చేశారు. 2014లో ఎమ్మెల్యేగా గెలుపొందిన సుధీర్ రెడ్డికి మల్లారెడ్డి బీఆర్ఎస్ లో చేరికతో 2018లో టికెట్ రాలేదు. అప్పటి నుంచి ఆయన ఎలాంటి ప్రాధాన్యత లేకుండా ఉన్నారు. మంత్రిపై ఆరోపణలు ఉండటంతో వచ్చే ఎన్నికల్లో టికెట్ తనకేనని ధీమాగా ఉన్నారు సుధీర్.
డోర్నకల్ లో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలోనే మంత్రి సత్యవతి రాథోడ్ వచ్చే ఎన్నికల్లో తాను డోర్నకల్ నుంచి పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఎమ్మెల్సిగా కొనసాగుతున్న ఆమె ఎమ్మెల్యేగా ఎన్నిక కావాలని అనుకుంటున్నారు. అయితే…ఆమెను ములుగు నుంచి పోటీ చేయిస్తే ఎలా ఉంటుందని బీఆర్ఎస్ పెద్దలు ఆలోచిస్తుండగా…సీతక్కపై పోటీకి సత్యవతి వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఆమె డోర్నకల్ నుంచి పోటీకి మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే ఇక్కడి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న రెడ్యా నాయక్ మరొసారి పోటీ చేయాలనుకుంటున్నారు. ఆయన కూతురు ఎంపీగా ఉండటంతో ఇద్దరిలో ఒకరికే టికెట్ వస్తుందని సత్యవతి వర్గం ప్రచారం చేస్తోంది.
పైలెట్ రోహిత్ రెడ్డి , పట్నం మహేందర్ రెడ్డిల మధ్య పోరు ఓ రేంజ్ లో కొనసాగుతోంది. ఓ జాతర సందర్భంగా ఇద్దరు నేతలు కాలర్ పట్టుకునే వరకు వెళ్ళారు. ఎక్కడ కలిస్తే అక్కడ కయ్యానికి కాలు దువ్వుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ నాదేంటే నాదేనని చెబుతున్నారు. కేటీఆర్ తనకు హామీ ఇచ్చాని పైలెట్ చెబుతుండగా.. కాదు తనకు కేసీఆర్ హామీ ఇచ్చారని పట్నం అంటున్నారు. దీంతో ఇద్దరి మధ్య తాండూర్ రాజకీయం రసవత్తరంగా కొనసాగుతోంది.
మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి ఉండగానే.. అక్కడి నుంచి పోటీ చేసేందుకు మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు కుమారుడు రోహిత్ ట్రై చేస్తున్నాడు. నియోజకవర్గవ్యాప్తంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకుంటూ హడావిడి చేస్తున్నారు. గతంలో మెదక్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన సమయంలో తనకున్న పరిచయాలతో అక్కడ తన కుమారిడికి పట్టు లభించేలా చొరవ చూపిస్తున్నారు. దీంతో మెదక్ బీఆర్ఎస్ పద్మ వర్గీయులు, మైనంపల్లి వర్గీయులుగా విడిపోయింది.
స్టేషన్ ఘన్ పూర్ లోనూ ఇదే సిట్యుయేషన్. కడియం శ్రీహరి – రాజయ్యల మధ్య రాజకీయపోరు నివురుగప్పిన నిప్పులా ఉంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ మాకేంటే మాకేనని ఇద్దరు ప్రచారం చేసుకుంటున్నారు. రాజయ్యపై వస్తోన్న లైంగిక ఆరోపణలతో ఆయన టికెట్ రాదంటూ కడియం వర్గం చేసుకుంటుండగా..ఈ ప్రచారమంతా కడియం పనేనని రాజయ్య వర్గం తిప్పికోడుతోంది.
కోదాడలో బొల్లం మల్లయ్య యాదవ్ లకు పోటీగా శశిధర్ రెడ్డి , చందర్ రావు టికెట్ ప్రయత్నాలు చేస్తున్నారు. ఆత్మీయ సమ్మేళనాలతో రచ్చ చేస్తున్నారు. ప్రత్యర్ధి వ్యతిరేకులతో వరుసగా సమావేశాలు నిర్వహిస్తూ నియోజకవర్గంలో మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో ఆయా నేతలు ఉన్నారు. ఈ నియోజకవర్గంలోనూ నేతల్లో టికెట్ పై ఓ రకమైన ధీమా కనిపిస్తోంది.
అచ్చంపేటలోనూ గువ్వలకు వ్యతిరేకంగా ఎంపీ రాములు కుమారుడు భరత్ ప్రసాద్ టికెట్ ఆశిస్తున్నారు. అయితే గువ్వలపై తీవ్ర వ్యతిరేకత ఉండటంతో భరత్ కు టికెట్ ఇచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. గువ్వలను నాగర్ కర్నూల్ పార్లమెంట్ కు పోటీ చేయిస్తారని అంటున్నారు. మరోవైపు…అచ్చంపేటలో భరత్ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయవద్దంటూ ఎంపీ రాములుతోనే ఎమ్మెల్యే గువ్వల ఫోన్ కాల్ లో వాగ్వాదానికి దిగాడు.
ఇలా చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య సఖ్యత కొరవడింది. ఆశావహులు ఎవరికీ వారు తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సమయంలోనే కేసీఆర్ సర్వే ఎమ్మెల్యేలకు టెన్షన్ పుట్టిస్తుండగా… ఆశవహులకు మాత్రం కొత్త ఆశలు కల్పిస్తోంది.