భారత రాష్ట్ర సమితి ఏపీ శాఖను ఏర్పాటు చేశారు. అద్యక్షుడిగా తోట చంద్రశేఖర్ ను నియమిస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. సంక్రాంతి తరువాత ఏపీలో ఆఫీసు కూడా ప్రారంభిస్తామని చెప్పారు. పార్టీని మరింత విస్తరించేందుకు ఏపీలో భారీ బహిరంగ కూడా సభను ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే కేసీఆర్ ఏపీ పర్యటనకు ముందు ఆయన కొన్ని అంశాలపై స్పష్టత ఇవ్వాల్సి ఉంది.
ఏపీలో నెలకొన్న సమస్యలపై కేసీఆర్ తన విధానం స్పష్టం చేయాల్సి ఉంది. సమస్యలపై బీఆర్ఎస్ విధానం ప్రకటించకుండానే ఏపీలో పార్టీని విస్తరిస్తే జనాలు విశ్వసించే అవకాశం లేదు. గత ఎన్నికల్లో ఏపీ రాజకీయాల్లో వేలు పెట్టిన కేసీఆర్ వైసీపీకి సహకరించారు. ప్రత్యేక హోదా కోసం కేంద్రానికి లేఖ రాస్తామన్నారు. కాని ఇప్పటివరకు లేఖ రాయనేలేదు. ఇప్పుడు స్పెషల్ స్టేటస్ మరుగున పడిపోయిన అంశమే అయినా మూడు రాజధానులపై కేసీఆర్ తన విధానం ప్రకటించాల్సి ఉంది.
గతంలో కేటీఆర్ మూడు రాజధానులకు జై కొట్టారు. అపుడు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రకటించారు. ఇప్పుడు బీఆర్ఎస్ అయింది. పార్టీలో మార్పు వచ్చినట్టుగానే విధానంలో కూడా మార్పు వచ్చిందా..? అనేది స్పష్టత ఇవ్వాల్సి ఉంది. అలాగే , విభజన సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ఇటీవల ఏపీ సర్కార్ తెలంగాణపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఉమ్మడి ఆస్తులు పంచడం లేదని న్యాయం చేయాలని కోరుతోంది. లక్ష కోట్లకుపైగా ఆస్తులు పంచాల్సి ఉందని చెబుతోంది. అలాగే విద్యుత్ బకాయిలు కూడా చెల్లించాలని డిమాండ్ చేస్తోంది.
ఏపీ, తెలంగాణల మధ్య జల వివాదాలు కూడా ఉన్నాయి. పోలవరం ప్రాజెక్టు ఎత్తు తగ్గించాల్సిందేనని తెలంగాణ సర్కార్ డిమాండ్ చేస్తోంది. అలాగే , ఏడు మండలాలను తిరిగి తెలంగాణలో కలపాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. వీటిపై కేసీఆర్ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. కేసీఆర్ ఇతర రాష్ట్రాల్లో చేసిన రాజకీయాలు ఏపీలోనూ చేస్తామంటే కుదరదు. ఎందుకంటే.. ఏపీతో తెలంగాణకు కొన్ని పంచాయితీలున్నాయి. కాబట్టి వీటిపై కేసీఆర్ స్పష్టత ఇస్తేనే అక్కడి జనాలు ఆయన్ను విశ్వసించే అవకాశం ఉంది.
Also Read : కేసీఆర్ సన్నిహితులే బీజేపీకి విరాళం ఇస్తుండ్రు..!