స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అదినేత చంద్రబాబుకు రిమాండ్ ను పొడగించింది ఏసీబీ కోర్టు. మరో రెండు రోజులపాటు సెప్టెంబర్ 24 వరకు రిమాండ్ ను పొడగిస్తున్నట్లు స్పష్టం చేసింది. దీంతో ఏసీబీ న్యాయస్థానం తీర్పుతో చంద్రబాబు మరో రెండురోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉండనున్నారు.
ఈవాల్టితో చంద్రబాబు రిమాండ్ పూర్తి కానున్న నేపథ్యంలో పోలీసులు ఏసీబీ న్యాయస్థానంలో ఆయన్ను వర్చువల్ గా హాజరు పరిచారు. ఈ సందర్భంగా చంద్రబాబు అభిప్రాయాన్ని న్యాయమూర్తి కోరారు. జైలు సౌకర్యాల విషయంలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా..? అని అడిగారు. తనకు పెద్ద శిక్ష విధించారని..ఈ వయస్సులో జైలులో ఉంచి కుటుంబానికి దూరం చేసి మానసిక క్షోభకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ కేసులో ముందుగా తనకు నోటిసులు ఇవ్వకుండా అరెస్ట్ చేయడం దుర్మార్గమని.. ముందుగా విచారణ జరిపి తప్పు ఉన్నట్లు తేలితే అప్పుడు అరెస్ట్ చేయాల్సిందని చంద్రబాబు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. జైలులో ఇబ్బందులు ఉంటె మీకు అనుకూలంగా సౌకర్యాలు ఏర్పాటు చేసేలా ఆదేశాలు జారీ చేస్తానని న్యాయమూర్తి తెలిపారు.
ఈ కేసులో మిమ్మల్ని విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ కోరుతోంది. కస్టడీ అవసరం లేదని మీ తరుఫు న్యాయవాదులు కోరుతున్నారు. ఇప్పుడు మీరు పోలీసు కస్టడీలో లేరు.. జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. దీనిని శిక్షగా భావించకండని న్యాయమూర్తి చంద్రబాబుతో అన్నారు. మీపై పిటిషన్లు పెండింగ్ లో ఉన్న కారణాల రీత్యా రిమాండ్ ను పొడగిస్తున్నామని ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది.
Also Read : లోక్ సభ సీటా..? రాజ్యసభా..? -నాగార్జునకు వల వేస్తోన్న వైసీపీ..?