ప్రపంచవ్యాప్తంగా భారీగా కరోనా కేసులు నమోదు అవుతోన్న నేపథ్యంలో కోవిడ్ తాజా పరిస్థితిపై కేంద్రం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించింది. ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవియా అద్యక్షతన సమీక్ష జరిగింది.. ఈ సమావేశానికి సీనియర్ అధికారులు, వైద్య నిపుణులు హాజరయ్యారు. చైనా, జపాన్, అమెరికా, బ్రెజిల్ సహా పలు దేశాల్లో కేసులు భారీగా పెరుగుతున్నాయి. భారత్ కు కూడా ముప్పు పొంచి ఉందని, జాగ్రత్తలు పాటించాలని వైద్య రంగ నిపుణులు హెచ్చరిస్తుండటంతో ముందస్తుగా కేంద్రం ఈ సమీక్ష సమావేశం నిర్వహించింది. ఇక నుంచి మాస్క్ లను ధరించాలని , రద్దీ ప్రాంతాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాలని ఆదేశించింది.
కరోనాపై అన్ని రాష్ట్రాలను అలర్ట్ చేస్తూ కేంద్రం లేఖ రాసింది. ఇదివరకైతే అనుమానమున్న కేసు శాంపిల్స్ మాత్రమే జీనోమ్ సీక్వెన్సింగ్ కు పంపాలని సూచించగా… ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులతో ప్రతి పాజిటివ్ కేసును కూడా జీనోమ్ సీక్వెన్స్ కు పంపి పరీక్షించాలని ఆదేశించింది. ఆ వేరియంట్ లో ఏదైనా మ్యుటేషన్ ఉందా.? కొత్త మ్యుటేషన్ వచ్చిందా..? లక్షణాలు కొత్తగా ఏమైనా ఉన్నాయా..? అనే పరీక్షించాలని సూచించింది. గతంలో కొనసాగించిన పద్ధతిని కొనసాగించాలని( ట్రేసింగ్, టెస్టింగ్, ట్రీట్మెంట్ ) ట్రిపుల్ టి విధానం కొనసాగించాలి. సెకండ్, వేవ్ సమయంలో ఎలాగైతే మేనేజ్ చేశారో ఇప్పుడు కూడా అదే విధానం కొనసాగించాలనే కేంద్రం సూచనలను తప్పకుండా పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది.
ప్రస్తతమైతే గత వారం రోజులుగా రోజు 4 నుంచి ఐదు కేసులు మాత్రమే నమోదు అవుతున్నాయి. మంగళవారం 4వేలకు పైగా టెస్టులు చేస్తే ఐదు కేసులు మాత్రమే నమోదు అయ్యాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో కొత్త మ్యుటేంట్ అయితే రాలేదు కానీ, ప్రస్తుతమున్న ఒమిక్రాన్ వైరస్ మ్యుటేంట్ అయి కొత్త వేరియంట్ గా రూపాంతరం చెందితే ఎప్పటికప్పుడు అలర్ట్ గా ఉంటామని వైద్యారోగ్య శాఖ చెబుతోంది. కేంద్ర ప్రభుత్వ సూచనలు పాటిస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది.