బంగారు తెలంగాణ పేరుతో బీఆర్ఎస్ సర్కార్ దండిగానే అప్పులు చేసింది. అవన్నీ తడిసి మోపెడు అయ్యాయి. ఏంటి ఈ అప్పుల జాతర అని ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు నిలదీస్తే రాష్ట్రాన్ని బంగారు తునక చేయాలంటే అప్పులు కావా..? అంటూ ఎదురుదాడి చేస్తూ వస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికీ అప్పులు రూ. 75,577 కోట్ల అప్పులు ఉంటే ఇప్పుడు రూ. 4,33,817.6 కోట్లకు చేరింది.
తెలంగాణ ప్రభుత్వం చేసిన అప్పుల వివరాలను వెల్లడించాలని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పార్లమెంట్ లో కేంద్రాన్ని ప్రశ్నించారు. బహిరంగ మార్కెట్ రుణాలు, కార్పోరేషన్ల పేరుతో బీఆర్ఎస్ సర్కార్ తీసుకున్న రుణాలను అన్నింటిని కేంద్రం వివరించింది. ఇప్పటివరకు తెలంగాణ ప్రభుత్వం రూ. 4,33,817.6 కోట్లు అప్పు చేసిందని పార్లమెంట్ లో వెల్లడించింది.
రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేశారని ఇటీవల ప్రతిపక్ష నేతలు విమర్శిస్తే… అప్పుల విషయంలో రాద్దాంతం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు మండిపడ్డారు. అప్పుల విషయాన్ని దాచేందుకు ప్రయత్నించారు. ఇప్పుడు కాంగ్రెస్ ఎంపీ ద్వారా అప్పుల విషయం బయటకు వచ్చింది. నాలుగు లక్షల కోట్లకు అప్పులు చేరాయని ప్రతిపక్ష నేతలు చెబితే ఎదురుదాడి చేసిన ప్రభుత్వ పెద్దలు కేంద్రం వెల్లడించిన గణాంకాలతో మొహం ఎక్కడ పెట్టుకుంటారో.!
Also Read : సిరిసిల్లలో ఓటర్లు గుర్రు – కూకట్ పల్లి నుంచి కేటీఆర్ పోటీ..?
తెలంగాణ సర్కార్ అప్పులపై కేంద్రం క్లారిటీ ఇచ్చింది. ఏపీ అప్పులపై మాత్రం స్పష్టత ఇవ్వదు. బ్యాంకులు, కార్పొరేషన్ల నుంచి తీసుకున్న రుణం గురించి మాత్రం పూర్తి వివరాలు ఇవ్వదు. కేవలం ఆర్బీఐ తీసుకున్న రుణాల వివరాలే ఇస్తుంది. వీటిని చూపించి వైసీపీ నేతలు .. తాము తక్కువ శాతమే అప్పు చేశామని గొప్పలు పోతారు. నిజానికి ఏపీ అప్పు రూ. పది లక్షల కోట్లకు దగ్గర అయిందని గణాంకాలు చెబుతున్నాయి.