గత ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపి సెంటిమెంట్ ను మరోసారి రగిల్చి టీఆర్ఎస్ ను అధికారంలోకి తీసుకురావడంలో కేసీఆర్ సఫలీకృతమయ్యారు. కాని మరోసారి తెలంగాణ , ఆంధ్ర అనే సెంటి మెంట్ పునరావృత్తమయ్యే అవకాశం లేదు. పైగా , ప్రతిపక్షాలు మంచి టచ్ లో కనిపిస్తున్నాయి. దీంతో కేసీఆర్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కావాలని కేంద్ర దర్యాప్తు సంస్థల గురించి కేసీఆర్ తరుచుగా వివాదాస్పదంగా మాట్లాడుతున్నారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. కేంద్రం దూకుడుగా వ్యవహరించి ఈడీ, సీబీఐ లను రంగంలోకి దించిన పక్షాన తెలంగాణపై కేంద్రం పెత్తనమంటూ రివర్స్ లో నరుక్కురావాలని పీకే వ్యూహంలో భాగంగా కేంద్రంపై కేసీఆర్ కాలు దువ్వుతున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
కాళేశ్వరం ప్రాజెక్టులో వేల కోట్ల అవినీతి జరిగిందని.. ఇందులో కల్వకుంట్ల ఫ్యామిలీకు ముడుపులు అందాయని బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇందుకు సంబంధించిన ఆధారాలు తమ వద్ద ఉన్నాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా కోరారు. కాని రేవంత్ కు అపాయింట్ మెంట్ లభ్యం కాలేదు. అలాగే, మిషన్ భగీరథ, మిషన్ కాకతీయలోనూ అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. తెలంగాణలో ఎలాగైనా అధికారంలోకి రావాలని కసితో ఉన్న బీజేపీ అగ్రనాయకత్వం కల్వకుంట్ల అవినీతిపై నిఘా వర్గాలతో సమాచారం సేకరించిందన్న ప్రచారం ఉంది. ఈ సమాచారం కేసీఆర్ కు చేరడంతో.. దీనిని తనకు అనుకూలంగా మలుచుకోవడంతోపాటు ఇందులో నుంచి సెంటిమెంట్ ను పుట్టించాలని భావిస్తున్నారన్న చర్చ జరుగుతోంది.
కేంద్రం దూకుడుగా వ్యవహరించి కేసీఆర్ కుటుంబ ఆస్తులపై ఈడీ , సీబీఐ లను రంగంలోకి దించిన మరుక్షణం తెలంగాణపై కేంద్రం పెత్తనం చెలాయిస్తోంది. ఈ ప్రాంత ఆత్మగౌరవం, ఆస్తిత్వం దెబ్బతీసేందుకు కుట్రలు చేస్తోందంటూ మరోసారి భావోద్వేగాలను రెచ్చగొట్టే అవకాశం లేకపోలేదని పొలిటికల్ ఏనలిస్టులు అభిప్రాయపడుతున్నారు. ఈ సీన్ ఇలాగే కొనసాగుతూ ఉండగానే…బీజేపీ, కాంగ్రెస్ లను దోషిగా చూపిస్తూ…ముందస్తుకు కేసీఆర్ వెళ్ళే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి నాడు చంద్రబాబును బూచిగా చూపిన కేసీఆర్ ఇప్పుడు మోడీని శత్రువుగా చూపించి ఎన్నికల్లో లబ్ది పొందాలని చూస్తున్నాడన్న చర్చ జరుగుతోంది. ఈ వ్యూహాత్మక ఎత్తుగడలో భాగంగా ఈడీ , సీబీఐ ల దాడుల కోసం కేసీఆర్ వెయిట్ చేస్తున్నారన్న ప్రచారం గుప్పుమంది.
Subscribe to Updates
Get the latest creative news from FooBar about art, design and business.