తెలంగాణలో పసుపు బోర్డు , రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఎట్టకేలకు కేంద్రం స్పందించింది. పార్లమెంట్ వేదికగా తన వైఖరిని స్పష్టం చేసింది. తెలంగాణలో పసుపు బోర్డు, రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసే ప్రతిపాదనలు ఏవి తమ వద్ద లేవని తేల్చి చెప్పింది.
పసుపు బోర్డు , రైల్వే కోచ్ ఫ్యాక్టరీపై పార్లమెంట్ లో బీఆర్ఎస్ ఎంపీలు వెంకటేష్ నేత, దయాకర్ , రంజిత్ రెడ్డి , కవితలు కేంద్రాన్ని ప్రశ్నించారు. పసుపు బోర్డుపై నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ పలుమార్లు కేంద్రాన్ని ప్రశ్నిస్తూనే ఉన్నారు. కానీ కేంద్రం దాటవేస్తూ వచ్చింది. ఇప్పుడు బీఆర్ఎస్ ఎంపీలు కూడా కేంద్రాన్ని నిలదీయడంతో కేంద్రం తన వైఖరిని స్పష్టం చేసింది.
ఇప్పుడున్న పరిస్థితుల్లో వాటిని తెలంగాణలో ఏర్పాటు చేయలేమని స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్రమంత్రి అనుప్రియ పటేల్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశంలో పసుపు బోర్డు లేదా మరేదైనా బోర్డును ఏర్పాటు చేసే ప్రతిపాదన ఏదీ పరిశీలనలో లేదని ఆమె తెలిపారు.
అదేవిధంగా ఖాజీపేట్ లో రైల్ కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేసే ప్రతిపాదన కూడా తమ వద్ద లేదని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దీంతో నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ పసుపు బోర్డు తీసుకొస్తానని హామీ ఇచ్చి రైతులను మోసం చేశాడని బీఆర్ఎస్ ఎంపీలు మండిపడ్డారు.
పసుపు బోర్డు విషయంలో సొంత పార్టీ ఎంపీకి కేంద్రంలోని బీజేపీ వెన్నుపోటు పొడిచిందని మండిపడుతున్నారు బీఆర్ఎస్ ఎంపీలు. పసుపు బోర్డుపై హామీ ఇచ్చి కవితను ఓడించాలని అరవింద్ కు చెప్పి..ఇప్పుడు ఆ హామీని నెరవేర్చేందుకు కేంద్రం అనాసక్తి చూపడం సొంత పార్టీ ఎంపీని అవమానించడమేనని అంటున్నారు.
Also Read : బండి సంజయ్ కి కేటీఆర్ షాక్ – ధర్మపురి అరవింద్ కు గాలం…?