పదో తరగతి పరీక్షల నిర్వహణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. వార్షిక పరీక్షలన్నింటిని సీసీ కెమెరా పర్యవేక్షణలో నిర్వహించాలని నిర్ణయించింది. ప్రతి పరీక్షా కేంద్రంలో సీసీ కెమెరాలను అమర్చేలా చర్యలు చేపట్టాలని విద్యాశాఖను ఆదేశించింది.
గత ఏడాది ఏపీలో పదో తరగతి పరీక్ష పేపర్లు లీక్ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కార్పోరేట్ , ప్రైవేట్ విద్యా సంస్థలు ఇదే తరహాలో పేపర్లు లీక్ చేస్తాయనే అనుమానంతో సీసీ కెమెరాల నిఘాలో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం ఆదేశించింది. పరీక్ష ప్రశ్న పత్రాలను సీల్ చేసినప్పటి నుంచి జవాబు పత్రాలను ప్యాక్ చేసే వరకు అంత సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యేలా కెమెరాలను ఏర్పాటు చేయాలని పేర్కొంది.
ఈ సీసీ కెమెరాలను చీఫ్ సూపరింటెంట్, డిపార్ట్‌మెంట్ అధికారి గదుల్లో బిగించాలని ఆదేశించింది. ప్రభుత్వ పాఠశాల సెంటర్లంటిన్నింటిలోనూ సీసీ కెమెరాలు ఉండేలా చూడాలని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు జిల్లా విద్యాశాఖ అధికారులకు ఆదేశాలిచ్చారు.
కాగా, పరీక్ష కేంద్రాల్లో 3 మెగా పిక్సెల్, 30 మీటర్ల రేంజ్, 180 డిగ్రీల వరకు కవర్ చేసేలా సీసీ కెమెరా ఉండాలని.. పరీక్షల్లో రికార్డు అయిన డేటాను నిక్షిప్తం చేయాలని ఆదేశించారు. పరీక్ష పూర్తయిన తర్వాత సాఫ్ట్ కాపీని భద్రపర్చాలి. సీసీటీవీ ఫుటేజీలకు మానిటర్లను ఏర్పాటు చేయాలి. ప్రైవేటు పాఠశాలల సెంటర్లలోనూ ఆయా యాజమాన్యాలు సొంతంగా సీసీ కెమెరాలను అమర్చుకోవాలి. చీఫ్ సూపరింటెండెంట్లు పరీక్షల ఆఖరు రోజున సీసీటీవీ ఫుటేజీని సీల్డ్ కవర్లో భద్రపరిచి డీఈవోలకు అందజేయాలన్నారు.
పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్నారు. మొత్తం 5.1 లక్షల మందికిపైగా విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు.