జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు అందింది. ఈమేరకు ఢిల్లీ రావాలని పవన్ కు ఆహ్వానం పంపారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఢిల్లీ వెళ్లనున్న పవన్… హస్తినలో జేపీ నడ్డా, అమిత్ షాలతో భేటీ కానున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో టీడీపీతో కలిసి పోటీ చేయాలని పవన్ భావిస్తోన్న నేపథ్యంలో బీజేపీ హైకమాండ్ నుంచి పిలుపు అందటం చర్చనీయాంశంగా మారింది. అయితే పవన్ ను పిలిచింది ఏపీ రాజకీయాలపై చర్చించేందుకు కాదని… కర్ణాటక ఎన్నికల విషయమై మాట్లాడేందుకు ఆయనకు ఆహ్వానం పంపారని తెలుస్తోంది.
కర్ణాటక ఎన్నికల్లో బీజేపీ విజయానికి ఎన్ని మార్గాలు ఉన్నాయో వాటన్నింటిని పరిశీలిస్తోంది. కర్ణాటకలో కమలం వాడిపోతే దక్షిణాదిన మరీ ముఖ్యంగా లోక్ సభ ఎన్నికలపై ప్రభావం చూపుతుందని బీజేపీ అధినాయకత్వం ఆందోళన చెందుతోంది. ఈమేరకు కన్నడనాటన పవన్ తో ప్రచారం చేయిస్తే బాగుంటుందని భావిస్తోన్న కమలం అగ్రనేతలు ఆయనతో సంప్రదింపులు జరిపేందుకు ఢిల్లీకి పిలిచినట్లు సమాచారం. ఇప్పటికే ఏపీలో జనసేన, బీజేపీ పొత్తులో ఉన్నాయి. ఈ స్నేహంతోనే కర్ణాటకలో పవన్ తో ప్రచారం చేయాలని ఆయన్ను కోరే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఉత్తర కర్ణాటకలో చాలా వరకూ తెలుగు ఓటర్లు గెలుపు అవకాశాలను ప్రభావితం చేయగలిగే స్థాయిలో ఉంటారు. బళ్లారి దగ్గర మొదలుపెట్టి రాయచూరు, సింధనూరు, గంగావతి, దవణగిరి, గుల్బర్గ, బీదర్ వరకూ అయితే ఆంధ్రా, లేదంటే తెలంగాణ సెటిలర్స్ ది కీలక వర్గం. వీటిని దృష్టిలో పెట్టుకొని పవన్ కు ఈ స్థానాల్లో ప్రచారబాధ్యతలు అప్పగించాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. అందుకే కర్ణాటకలో బీజేపీ స్టార్ క్యాంపెయినర్ గా పవన్ సేవలను వాడుకోవాలని చూస్తున్నారు. చూడాలి మరి బీజేపీ అధినాయకత్వం విజ్ఞప్తిని పవన్ మన్నిస్తారో లేదో.
Also Read : జగన్ బండారం బయటపెట్టేందుకు కేవీపీ రెడీ