ఓ వైపు లిక్కర్ స్కామ్ తో కల్వకుంట్ల కవిత ఇరకాటంలో పడగా… మరోవైపు కేసీఆర్ కూడా ఇబ్బందుల్లో పడే సూచనలు కనిపిస్తున్నాయి. కేంద్రంపై కారాలు మిరియాలు నూరుతున్నా కేసీఆర్ కు దిమ్మతిరిగే రీతిలో షాక్ ఇచ్చేందుకు కేంద్రం తెరవెనక కసరత్తు చేస్తోంది.
ఇంతకాలం కాళేశ్వరం ప్రాజెక్టుపై ఎన్ని ఆరోపణలు వచ్చినా పట్టించుకోని కేంద్రం… కేసీఆర్ దూకుడు రాజకీయాలతో రూట్ మార్చింది. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతికి సంబంధించిన వివరాలను సేకరించే పనిలో పడింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లపైనే ఖర్చు చేశారు. ప్రతిసారి ప్రాజెక్టు వ్యయాన్ని పెంచుతూ పోయారు. 30వేల కోట్లతో నిర్మాణం చేస్తామని లక్ష 30కోట్లకు తీసుకెళ్ళారు. దీంతో ఈ ప్రాజెక్టు కల్వకుంట్ల కుటుంబానికి ఏటీఎంలా మారిందన్న ఆరోపణలు ఉన్నాయి. స్వయంగా కేంద్రంలోని బీజేపీ నేతలే ఈ కామెంట్స్ చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు కాంట్రాక్ట్ మేఘా కృష్ణారెడ్డికి దక్కింది. ఇప్పుడు ఈ కాంట్రాక్ట్ ఖర్చు గురించి కాగ్ ఆరా తీస్తోంది. మొదట కేంద్ర దర్యాప్తు సంస్థలని దించకుండా ముందుగా కాళేశ్వరం ప్రాజెక్టు ఖర్చులను తెలుసుకోవాలని కేంద్రం అనుకుంటోంది. ఇందుకోసం కాగ్ ఉన్నతాదికారి స్వయంగా రంగంలోకి దిగనున్నారు. ఈనెల 11న ప్రాజెక్టును పరిశీలించేందుకు ప్రాజెక్టుకు రానున్నారు. ప్రాజెక్టు సమూహంలోని అన్నారం పంపుహౌస్ సుందిళ్ల బ్యారేజీలను పరిశీలిస్తారు. కొంతకాలంగా రహస్యంగా ఈ ప్రాజెక్టు వివరాలను సేకరిస్తోంది. అయితే.. తెలంగాణ అధికారులు ఇస్తోన్న సమాచారం…కాళేశ్వరం ప్రాజెక్టులకు అయిన ఖర్చులకు ఏమాత్రం సెట్ కావడం లేదని కాగ్ అధికారులు తెల్చినట్లు సమాచారం. ఇది బీఆర్ఎస్ పెద్దలను ఆందోళనకు గురి చేస్తోంది.
కాళేశ్వరం ప్రాజెక్టుతోనే కల్వకుంట్ల కుటుంబం కోట్ల ఆస్తులకు పడగలెత్తిందని.. ఇందుకు సంబంధించిన ఆధారాలను ఇస్తానని రేవంత్ ఎప్పుడో చెప్పారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా అపాయింట్ మెంట్ ఇస్తే ఆధారాలు ఇవ్వడానికి సిద్దమని ప్రకటించారు. కానీ అక్కడి నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలోనే కవిత అవినీతిని రుజువు చేసే మార్గం దొరికిందని.. ఇదే సమయంలో కేసీఆర్ అవినీతి వ్యవహారాన్ని తేల్చేయాలని కేంద్రం భావిస్తోందని అంటున్నారు. ఇదే జరిగితే బీఆర్ఎస్ కు కష్టకాలం మొదలైనట్లే లెక్క.
Also Read : తెలంగాణలో అలజడులకు ఆపార్టీ కుట్ర…?