ఏపీలోనూ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలోనే జరగనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ సదస్సుల నిర్వహణ దృష్ట్యా ఫిబ్రవరిలోనే బడ్జెట్ సెషన్స్ నిర్వహించాలనుకుంటున్నట్లు ఏపీ సర్కార్ చెప్పదల్చుకున్న… ముందస్తు ఆలోచతోనే తొందరగా బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.
ఏపీలో మార్చి మొదటి వారంలో అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సును నిర్వహిస్తున్నారు. ఈ సదస్సుకు ముందు వారం రోజులు చాలా బిజీగా ఉంటారు. కాబట్టి బడ్జెట్ వంటి కీలక సమావేశాలు నిర్వహించడం కష్టంగా ఉంటుంది. ఆ సదస్సు ముగిసిన వెంటనే జీ20 సన్నాహాక సదస్సు విశాఖలో జరగాల్సి ఉంది. ఇది కేంద్రం నిర్వహించేదే అయినా.. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ మధ్యలో అసెంబ్లీ సమావేశాలు నిర్వహించడం ఇబ్బందే. అందుకే ఏపీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
తెలంగాణ ప్రభుత్వానికి ఏపీలో లాగా అంతర్జాతీయ సదస్సులు నిర్వహించే పనులేమి లేకపోయిన ఫిబ్రవరిలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తోంది. అదే నెలలో బడ్జెట్ కూడా పెట్టేస్తారు. ముందస్తు ఎన్నికల వ్యూహంతోనే మార్చిలో నిర్వహించాల్సిన బడ్జెట్ సమావేశాలను ఒక నెల ముందుగా నిర్వహిస్తున్నారన్న వాదనలు ఉన్నాయి. బీఆర్ఎస్ నేతలు మాత్రం ఈ వార్తలను ఖండించడం లేదు. అయితే ఏపీ సర్కార్ కు అంత అవసరం ఏముందనేది ప్రధాన ప్రశ్న.
తెలంగాణ , ఏపీ ముఖ్యమంత్రులు రాజకీయ అవగాహనతో కలిసి ముందస్తు ఎన్నికలకు వెళ్తారన్న అభిప్రాయం వినిపిస్తోంది. అయితే…బీఆర్ఎస్ బీజేపీపై యుద్ధం చేస్తుండగా, వైసీపీ మాత్రం అనధికార మిత్రపక్షంగా ఉంది. జగన్ ముందస్తు ఎన్నికలకై కేంద్రం అనుమతి కోసం ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేసీఆర్ ముందస్తుకు వెళ్తానంటే కేంద్రం సహకరించకపోవచ్చు. జగన్ కూడా ముందుకు వస్తే కేంద్రం అంగీకరించే చాన్స్ ఉందని అనుకుంటున్నారు. ఏపీలో జగన్ కు సహకరించి.. తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధిస్తే బీజేపీకి ఇబ్బంది అవుతుంది కాబట్టి.. జగన్ కు సహాకరిస్తే కేసీఆర్ కూ ముందస్తు ఎన్నికల విషయంలో సహకరించాల్సిందే. అందుకే రెండు రాష్ట్రాల్లో ఒకే సమయంలో బడ్జెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఏపీలోనూ బడ్జెట్ ను ఫిబ్రవరిలోనే పెట్టబోతున్నారంటే… జగన్ , కేసీఆర్ లు కలసే అసెంబ్లీలను రద్దు చేయడం.. ఎన్నికలకు వెళ్లడం చేయబోతున్నారన్న నమ్మకం ఎక్కువ మందిలో బలపడుతోంది.
Also Read : ఫిబ్రవరి మొదటి వారంలో బడ్జెట్ సెషన్ – చివరి వారంలో అసెంబ్లీ రద్దు..!?