అధికారం కోల్పోగానే ఆగం ఆగం అవుతున్నారు బీఆర్ఎస్ నేతలు. రాజకీయ విమర్శలు మాని వ్యక్తిగత విమర్శల వరకు వచ్చారు. కిందిస్థాయి క్యాడర్ ను కంట్రోల్ లో పెట్టాల్సిన అధ్యక్ష స్థాయి నేతే నోటికొచ్చిన బూతులు మాట్లాడుతున్నారు. సీఎం, మంత్రులు అని చూడకుండా తిట్ల పురాణం అందుకున్నాడు. అవన్నీ రాజకీయ విమర్శలు అని సరిపెట్టుకుందాం అనుకుంటే..ఈ మధ్య అధికారులను కూడా వదలడం లేదు. రాజకీయాలతో సంబంధం లేకుండా పనిచేసుకునేవారిని రొచ్చులోకి లాగుతున్నాడు కేటీఆర్. వారి పనులకు పదే పదే అడ్డుపడేలా కిందిస్థాయి క్యాడర్ ను రెచ్చగొడుతున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు నిజంగా సైకో రామ్ లాగానే వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.
అధికారంలో ఉండగా కలెక్టర్లతో కాళ్లు మొక్కించుకున్న అహంకారాన్ని…ఇప్పుడు కూడా ప్రదర్శిస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. మొన్నటికి మొన్న వికారాబాద్ కలెక్టర్ పై దాడికి అమాయకుల్ని రెచ్చగొట్టడం, ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర చేయడం వంటివి ప్రజలందరికీ తెలిసిందే. అధికారం కోల్పోతే ఇంతగా విచక్షణ కోల్పోవాలా? అంటూ ప్రజల నుంచి ఛీత్కారాలు కూడా ఎదుర్కున్న సంగతి తెలిసిందే. వివాదరహితుడిగా పేరున్న కలెక్టర్ ప్రతీక్ జైన్ పై దాడిని ప్రజలంతా ముక్తకంఠంతో ఖండించారు. దీని వెనుక ఫామ్ హౌజ్ కుట్రలను ఎండగట్టారు. అయితే తాజాగా సైకో రామ్ మాట్లాడిన మాటలపై మండిపడుతున్నారు ప్రజలు. సిరిసిల్లలో గులాబీ పార్టీ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ ను సన్నాసి అంటూ తిట్టారు. అంతేకాదు అధికారంలోకి వచ్చాక వడ్డీతో సహా చెల్లిస్తామని వార్నింగ్ ఇచ్చారు. అయితే ఇదే అధికారి బీఆర్ఎస్ హయాంలో కూడా పనిచేశారు. కానీ ఇప్పుడు అధికారం కోల్పోయేసరికి ఆ అధికారి చెడ్డవాడు అయిపోయాడు. పైగా కేటీఆర్ మరో ఆసక్తికర కామెంట్ కూడా చేశారు. నేను అంత మంచోన్ని కాదు అన్నారు. దీంతో నువ్వు మంచోడివి కాదని అందరికీ తెలుసు. కానీ కలెక్టర్ పై ఇప్పుడు చేసిన వ్యాఖ్యలతో నీలో మార్పు రాదని అర్ధమయిందని గుస గుసలాడుకుంటున్నారు.
ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ పై దాడికి కుట్ర చేయడం, తాజాగా సిరిసిల్ల కలెక్టర్ పై నోరు పారేసుకోవడం వంటి పరిణామాలతో అధికారుల్లో కూడా చర్చ మొదలైంది. రాజకీయాలకు అతీతంగా పనిచేసేవారిని పాలిటిక్స్ లోకి లాగడం ఏంటని సీరియస్ అవుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో వారు చెప్పిన దానికి అయ్యా ఎస్ అని తలూపని అధికారులపై అప్పుడే కాదు…ఇప్పుడు కూడా కక్ష సాధిస్తున్నారని మండిపడుతున్నారు. దీనిపై త్వరలోనే చర్చించి నిర్ణయం తీసుకోవాలని కూడా ఉన్నతాధికారులు భావిస్తున్నారట.