తెలంగాణలో అమలు అవుతోన్న పలు సంక్షేమ పథకాలకు తాత్కాలికంగా బ్రేకులు పడ్డాయి. నిధుల సమస్య తీవ్రంగా ఉండటంతో పథకాల అమలుకు అంతరాయం కల్గుతోంది. ఈ నేపథ్యంలో పథకాల అమలును కొన్ని రోజులపాటు వాయిదా వేయాలని కేసీఆర్ ఆదేశించినట్లు తెలుస్తోంది. కేసీఆర్ ఆదేశాలు ఇవ్వడం వెనక రాజకీయ లబ్ది కూడా ఉంది. పథకాలు వాయిదా వేయమనడం రాజకీయ లబ్ది ఎందుకు అవుతుంది..? అని ఆశ్చర్యపోకండి. ఎన్నికల షెడ్యూల్ ముందు పథకాల అమలును ప్రారంభిస్తే ఓట్లు రాలుతయనేది కేసీఆర్ వ్యూహం. అదే సమయంలో ఎన్నికల కోడ్ వచ్చాక ఎలాగూ ఈ పథకాల అమలుపై ప్రతిపక్షాలు అభ్యంతరం చెప్పడం ఖాయమే. దీనిని కూడా పొలిటికల్ గా అడ్వాంటేజ్ గా తీసుకోవాలని కేసీఆర్ భావిస్తున్నారు.
బీఆర్ఎస్ పథకాలను ప్రజలకు చేరువ చేస్తుంటే ప్రతిపక్షాలు అడ్డుకుంటున్నాయని కాంగ్రెస్, బీజేపీ లను బద్నాం చేసేలా కేసీఆర్ వ్యూహంతోనే పథకాల అమలుకు తాత్కాలికంగా బ్రేకులు వేసినట్లు తెలుస్తోంది. మరోవైపు ప్రస్తుతానికి ప్రభుత్వాన్ని నిధుల సమస్య వెంటాడుతోంది. బీసీ బంధు, దళిత బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మీ అమలు చేయాలంటే భారీగా నిధుల సమీకరణ జరగాల్సి ఉంది. రైతు రుణమాఫీ కోసమే వైన్స్ టెండర్లు మూడు నెలల ముందు పిలిచి ఆ నిధులను సమీకరించుకోగలిగారు. ఇప్పుడు ఈ పథకాల అమలు కోసం ఇప్పటికప్పుడు నిధులను ఎక్కడి నుంచి సర్దుబాటు చేయాలి..? అనే అన్వేషణ మొదలు పెట్టారు కేసీఆర్. అందుకే కొద్దిగా ఓపిక పడితే నిధులు సమకూరుతాయి. ఎన్నికల ముంగిట ప్రజలకు పథకాలు చేరువ చేస్తే ఓట్లు రాలుతాయనే లెక్కతో కేసీఆర్ అండ్ కొ ఉన్నట్లు తెలుస్తోంది.
కేసీఆర్ చేస్తోన్న ఈ వ్యూహం ఎంతవరకు వర్కవుటవుతుందో. మామూలుగా పథకాలు ప్రకటించిన దగ్గర నుంచి అమలు చేస్తేనే జనాలు గుర్తుంచుకుంటారు. ఎన్నికల సమయంలో పథకాలను ప్రకటించేసి తర్వాత పట్టించుకోకుండా మళ్ళీ ఎన్నికలకు ముందు పథకాలను అమలు చేస్తే జనాలు ఎందుకు పట్టించుకుంటారు.? చూడాలి మరి కేసీఆర్ పథకాలకు తాత్కాలిక బ్రేకులు వ్యూహం ఎంతవరకు సక్సెస్ అవుతుందో..!!
Also Read : సీన్ రివర్స్ – కేసీఆర్ టైం బ్యాడ్ ..!!