జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ గెలవడం కష్టమని తేలిపోయింది. అందుకే కావాల్సినంత డ్యామేజ్ చేయాలని అన్ని రకాలుగా ప్లాన్ చేస్తోంది. ఇన్నాళ్లూ కలిసున్న ప్రజల్ని కులాలు, వర్గాలుగా విడదీస్తోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పదేళ్లు ఏం చేశామో చెప్పేందుకు ఏమీ లేకపోవడంతో…తప్పుడు ప్రచారాలు, ఎన్నికల ఉల్లంఘనలతో బరితెగిస్తోంది. కనీసం డిపాజిట్ అయినా దక్కించుకోవాలన్న తపనతో అడ్డమైన గడ్డీ కరుస్తోంది.
పదేళ్లు అధికారం చెలాయించిన బీఆర్ఎస్‌కు ఎన్నికల నిబంధనలు తెలియనివి కాదు. కానీ పోల్ చిట్టీలు పంచుతూ స్వేచ్ఛంగా ఉల్లంఘనలకు పాల్పడుతోంది. అంతేకాదు కులాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ..ప్రజలతో విభజన రాజకీయాలు చేస్తోంది. ఇక ముస్లీంలను రెచ్చగొట్టేలా విభజన గీత గీస్తోంది.
ఎన్నికలంటే ప్రజలకు తాము ఏం చేశామో…ఏం చేస్తామో చెప్పాలి. కానీ బీఆర్ఎస్ మాత్రం అవన్నీ పక్కన పెట్టి ఫేక్ ప్రచారాలు, నాలుగు తిట్లు మాత్రమే ఎన్నికల ప్రచారం అన్నట్లుగా వ్యవహరిస్తోంది. మరోవైపు సెంటిమెంట్ రాజకీయాలకు పదును పెడుతోంది. కానీ ఏ ఒక్క చోట కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గానికి పదేళ్లలో తమ వల్ల వీసమెత్తు ఉపయోగం జరిగిందనే ప్రచారం కనిపించడం లేదు. పైగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను విమర్శించడమే పనిగా పెట్టుకుంది. పదేళ్లలో రేషన్ కార్డులు ఎందుకివ్వలేదని ప్రజలు ప్రశ్నిస్తుంటే మెల్లగా జారుకుంటున్నారు బీఆర్ఎస్ నాయకులు. అంతేకాదు డబుల్ బెడ్ రూం ఇండ్లు వచ్చిన పేదల సంఖ్య కూడా ఎక్కడా చెప్పడం లేదు. వీటన్నింటికీ తోడూ ఇన్నాళ్లూ తాము దోచుకున్న సొమ్మునంతా నీళ్లలా ఖర్చు చేస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు.
