బీఆర్ఎస్ వికృత క్రీడకు తెర తీసింది. ప్రజాపాలనను తట్టుకోలేక కుట్ర రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. అధికారం కోల్పోయి నిండా సంవత్సరం కూడా పూర్తికాలేదు. అప్పుడే అరాచక శక్తుల్ని రంగంలోకి దించుతోంది. ఇప్పటికే వికారాబాద్ కలెక్టర్ పై దాడి వెనుక ప్రత్యక్షంగా కేటీఆర్, పట్నం నరేందర్ రెడ్డి వంటి బీఆర్ఎస్ నేతలు ఉన్నట్లు రుజువైంది. పరోక్షంగా గులాబీ బాస్ ఉన్నట్లు ఆధారాలు కూడా లభ్యమయ్యాయి. అయితే తవ్వేకొద్ది బీఆర్ఎస్ అరాచకాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. మహబూబాబాద్ లో అల్లర్లకు కుట్ర చేసి ఫెయిల్ అయిన సంగతి తెలిసింది. అయితే ఇవి మాత్రమే కాదు వీలైన ప్రతీ చోటా అశాంతిని రాజేయాలని బీఆర్ఎస్ ప్లాన్ చేస్తోంది. దీనికోసం బీహారీ గ్యాంగ్ ను రంగంలోకి దించింది. మాజీ మంత్రి హరీష్ రావు వీటిని పర్యవేక్షిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో ఈ గ్యాంగ్ సభ్యులు పల్లెల్లో పర్యటించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వీడియోలు తీయడమే లక్ష్యంగా కనిపిస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నడూ లేని బూతుల రాజకీయానికి బీఆర్ఎస్ పార్టీ నేతల ఇళ్ల నుంచే కుట్ర జరుగుతున్నట్లు కీలక ఆధారాలు లభ్యమయ్యాయి. కేకే సర్వే బృందంలో హరీష్ రావు నిత్యం మంతనాలు జరపడం, వారికి సూచనలు చేయడం బీఆర్ఎస్ వర్గాల్లో చర్చకు దారి తీస్తోంది. ఇప్పట్లో ఎన్నికలేమీ లేవు. కనీసం బై ఎలక్షన్స్ వచ్చే అవకాశం కూడా లేదు. మరి ఇప్పుడెందుకు కేకే సర్వే బృందంతో చర్చలు చేస్తున్నారని గుసగుసలాడుకుంటున్నారు. అయితే రాష్ట్రంలో అశాంతిని రాజేయడమే ఈ వరుస భేటీల వెనుక ఉన్న మర్మమని ఆ పార్టీ వర్గాలంటున్నాయి. ఇది ఇప్పుడు జరుగుతున్న తంతు కాదని, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన నెల రోజులకే బీహారీ గ్యాంగ్ రంగంలోకి దిగినట్లు బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నదాని ప్రకారం తెలుస్తోంది. కలెక్టర్ పై దాడి, నిరుద్యోగులను రెచ్చగొట్టడం, మూసీ పరివాహక ప్రాంత ప్రజలతో బూతులు తిట్టించడం, రైతులతో అక్కడక్కడా ఆందోనలు చేయించడం వంటివి ఈ గ్యాంగుల ప్రోద్భలంతోనే జరిగిందని తెలుస్తోంది.
ఇదంతా చూస్తుంటే గురుకులాల్లో వరుసగా జరుగుతున్న పరిణామాల వెనుక కూడా బీఆర్ఎస్ కుట్ర గ్యాంగ్ హస్తం ఉందేమో అనే అనుమానాలు బలపడుతున్నాయి. నిజానికి కేకే బృందం చేసిన సర్వేల్లో రేవంత్ రెడ్డి సర్కారుపై సానుకూలతే కనిపించింది. దీంతో ఇది జీర్ణించుకోలేని గులాబీ పార్టీ నేతలు ప్రజల్లో లేని వ్యతిరేకతను సృష్టించేందుకు చాపకింద నీరులా పనిచేసుకుంటూ వస్తున్నారు. ఇందులో భాగంగా త్వరలోనే ఏడాది సందర్భంగా ప్రజాభిప్రాయం అంటూ ఓ ఫేక్ సర్వేను కూడా విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. ఈ సర్వే నివేదికను సిద్దం చేసేందుకు హరీష్ రావు ఇంట్లో కేకే బృందం వరుస భేటీలు అవుతోంది. తాజాగా టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు వెళ్లిన సందర్భంగా హరీష్ రావు ఇంట్లో కేకే బృందం భేటీ జరుగుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇది బీఆర్ఎస్ కుట్రలు నిజమే అనడానికి మరింత బలం చేకూరుస్తోంది.