జాతీయ రాజకీయాలంటూ బయల్దేరిన తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రపై ప్రత్యేకమైన దృష్టిపెట్టారు. ఇప్పటికే మహారాష్ట్రలో రెండు సభలను నిర్వహించిన బీఆర్ఎస్ మరోసారి భారీ బహిరంగ సభను నిర్వహిస్తోంది.
ఈ నెల 24న ఔరంగాబాద్ లో సభను నిర్వహిస్తున్నారు. ఈ సభకు కేసీఆర్ హాజరు కానున్నారు. ఏపీ, ఓడిశా రాష్ట్రాలకు బీఆర్ఎస్ రాష్ట్ర అద్యక్షులను కూడా ప్రకటించిన కేసీఆర్… ఈ రెండు రాష్ట్రాల్లో ఎలాంటి సభలు, సమావేశాలు నిర్వహించలేదు. కానీ మహారాష్ట్రలో రాష్ట్ర అద్యక్షుడి వెతుకులాటలోనున్న బీఆర్ఎస్ మాత్రం అక్కడ వరుసగా సభలు నిర్వహించడం ఆసక్తికరంగా మారుతోంది. ఎన్నికలున్న కర్ణాటకను వదిలేసి మహారాష్ట్రలో ఇలా సభలు ఏర్పాటు చేయడానికి గల ప్రత్యేక కారణం ఏంటని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
బీఆర్ఎస్ ఇప్పటివరకు మహారాష్ట్రల్లో నిర్వహిస్తోన్న సభలు ఒకప్పుడు నిజాం పాలనలో ఉన్నవే. పైగా మహారాష్ట్ర శివారు అంటే తెలంగాణ సరిహద్దుతోనున్న ప్రాంతాలే. మహారాష్ట్ర శివారు ప్రాంత ప్రజలకు నగదు బదిలీ వంటి పథకాలు అందడం లేదు. ఈ ప్రాంతాలన్నీ పూర్తిగా వెనకబడి ఉన్నాయి. దీంతో తెలంగాణలో అమలు చేస్తోన్న నగదు బదిలీ వంటి పథకాలను వివరిస్తూ వారిని బీఆర్ఎస్ వైపు ఆకర్షితుల్ని చేసేలా ప్రయత్నిస్తున్నారు. బీఆర్ఎస్ ను గెలిపిస్తే ఆ పథకాలను వారికి అందిస్తామనే భావన కలిగేలా చర్యలు చేపడుతున్నారు. ఇందుకోసం ఆదిలాబాద్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రత్యేక చొరవ చూపుతున్నారు.
మహారాష్ట్ర శివారు ప్రాంత ప్రజల్లో తెలంగాణలో అమలు అవుతోన్న పథకాల పట్ల విస్తృత చర్చ జరిగేలా ప్రణాళిక రూపొందించింది బీఆర్ఎస్. ఇందుకోసం ఏడు వీడియో స్క్రీన్ ప్రచార రథాలను తిప్పుతూ తెలంగాణ పథకాలను అక్కడి ప్రజలకు వివరిస్తున్నారు. తెలంగాణ ప్రజలకు అందుతోన్న పథకాలతో వారి జీవితాలలో గొప్ప మార్పు వస్తుందని తెలిపేలా కొన్ని వీడియోలు రూపొందించి అక్కడ వారికీ అర్థమయ్యేలా వివరించి మద్దతు పొందాలని ట్రై చేస్తున్నారు. అయితే.. ఏపీ , ఓడిశాలను వదిలేసి కేసీఆర్ మహారాష్ట్రపై ఫోకస్ చేయడానికి ఎన్సీపీని దెబ్బకొట్టే వ్యూహం ఉండొచ్చునని అంటున్నారు.
Also Read : ఎన్నికల సమయాన బీజేపీ గ్రాఫ్ డమాల్ – ఎందుకంటే..?