తెలంగాణలో మహిళాఓటర్లు అధికంగా ఉండటంతో వారిని ఆకర్షించేలా మహాలక్ష్మీ పథకం ప్రకటించిన కాంగ్రెస్ కు కౌంటర్ గా హామీలను ఇవ్వాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇప్పటికే తమ దగ్గర మెరికల్లాంటి పథకాలు ఉన్నాయని కేసీఆర్ , హరీష్ రావులు చెప్తుండటంతో ఆ పథకాలు ఏవై ఉంటాయనే చర్చ విస్తృతంగా జరుగుతోంది. ఇప్పటికే రైతు ఫించన్ అమలు సాధ్యాసాధ్యాలపై కసరత్తు చేస్తోన్న బీఆర్ఎస్.. మహిళల ఓట్లు గంపగుత్తగా పొందేలా ఓ హామీని ఇవ్వాలని మ్యానిఫెస్టో రూపొందించినట్లు తెలుస్తోంది.
కేసీఆర్ కు ఇంకా వైరల్ ఫీవర్ తగ్గలేదు. ఆయన కోలుకున్న వెంటనే కేబినెట్ లో బీఆర్ఎస్ ఎన్నికల హామీలపై చర్చించి వాటిని ప్రకటించనున్నారు. అందులో మహిళా బంధు అనే పథకం ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ మహాలక్ష్మీ అనే పథకం ప్రకటించింది. ఈ పథకం ద్వారా మహిళలకు గ్యాస్ సిలిండర్ ను రూ. 500లకే ఇవ్వడంతోపాటు ప్రతి నెల రూ. 2500లు ఇస్తామని స్పష్టం చేసింది. దీంతో వీటికి ధీటుగా బీఆర్ఎస్ హామీలను ప్రకటిస్తుందన్న అంచనాలు నెలకొన్నాయి.
మహిళా బంధు పథకం ప్రకటిస్తే మహిళలకు ఎంత ఆర్ధిక సాయం చేస్తారు..? వైట్ రేషన్ కార్డుదారులకే ఇస్తారా..? అందరికీ మహిళా బంధును వర్తింపజేస్తారా..? అనే చర్చలు అప్పుడే జరుగుతున్నాయి. మహిళా బంధు స్కీమ్ ద్వారా ఇచ్చే ఆర్థిక సాయం మూడు వేల వరకు ఉండే అవకాశం ఉంది. అలాగే చేయూత పథకానికి కౌంటర్ గా కేసీఆర్ నవంబర్ నుంచి లేదా కొత్త ఏడాది నుంచి ఫించన్ ను రూ. 4వేలకు పెంచే ప్రకటన చేయనున్నారు. కాంగ్రెస్ రైతు భరోసాకు ధీటుగా ప్రస్తుతం రైతు బంధు కింద ఇస్తోన్న ఆర్థిక సాయాన్ని పెంచుతామని కేసీఆర్ ప్రకటించి అవకాశం ఉంది.
ఈ అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించిన అనంతరం కేసీఆర్ అధికారికంగా ప్రకటించనున్నారు.