తెలంగాణ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికలకు ముందుగానే ప్రిపేర్ అయ్యారు. అభ్యర్థుల వడపోత కూడా పూర్తైంది. ఆషాడమాసం ముగిసిన తరువాత జూలై రెండో వారంలోనే బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసే అభ్యర్థుల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నారు. ఎన్నికలకు నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడం వెనక కేసీఆర్ వ్యూహం దాగి ఉందని పార్టీ వర్గాలే అభిప్రాయపడుతున్నాయి.
టికెట్ రాలేదనే అసంతృప్తితో ఆశావాహులు ఎన్నికల ముంగిట పార్టీని వీడితే అది బీఆర్ఎస్ కు మైనస్ అవుతుంది. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులను ఎన్నికల ముంగిట కొని తెచ్చుకోవద్దని…నాలుగు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని డిసైడ్ అయ్యారు కేసీఆర్. టికెట్ ఆశావాహులు అధికంగా ఉన్న చోట , ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న నియోజకవర్గాల్లో అభ్యర్థుల పేర్లను రెండో విడతలో ప్రకటించే యోచనలో కేసీఆర్ ఉన్నారు. మొదటి విడతలోనైతే 80మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించనున్నారు.
ఇప్పటికే జిల్లాల పర్యటనలో భాగంగా కేసీఆర్ వచ్చే ఎన్నికల్లో ఎవరు పోటీలో ఉంటారో క్లారిటీ ఇస్తున్నారు. కేటీఆర్ అయితే ఏకంగా అభ్యర్థుల పేర్లను చెప్పి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నారు. ఇప్పటివరకు కేసీఆర్, కేటీఆర్ ల ప్రకటనలు బట్టి దాదాపు 20 స్థానాల్లో ఎమ్మెల్యేలకు స్పష్టత వచ్చింది. మరికొంతమంది మందికి మాత్రం ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో వారికీ కష్టమేనని అంటున్నారు.
2018లో ముందస్తు ఎన్నికలకు వెళ్ళినప్పుడు కేసీఆర్ అభ్యర్థులను ముందుగానే ఫిక్స్ చేశారు. అసెంబ్లీ రద్దు రోజునే అభ్యర్థులను కూడా ప్రకటించారు. ఇప్పుడు కూడా అలాంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే, కాంగ్రెస్ కూడా దాదాపు అభ్యర్థుల ఎంపికపై ఓ నిర్ణయానికి వచ్చింది. ఎస్కే టీమ్ చివరి సర్వే ఆధారంగా అభ్యర్థుల పేర్లను ప్రకటించే అవకాశం ఉంది.
Also Read : టి. కాంగ్రెస్ పై ఫోకస్ పెట్టిన ట్రబుల్ షూటర్… అంత సెట్ చేశాడా..?