ఎన్నికల ముంగిట పథకాలతో ప్రజలను మచ్చిక చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. నాలుగున్నరేళ్లుగా ప్రజలను పట్టించుకోని వారు ఇప్పుడు ఏదో ఒక పథకం ప్రజలకు అందించి మెప్పు పొందాలని ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే పదవి ఊడిపోతుందని ఆందోళనతో ఉన్నారు. అందుకే ఓటర్లకు ఏదో ఒక పథకం ద్వారా లబ్ది చేకూర్చాలని చూస్తు న్నారు. దళిత బంధు, బీసీ బంధు, గృహలక్ష్మీలలో ఏదో ఒక పథకాన్ని ప్రజలకు అందించాలని పట్టుదలతో ఉన్నారు.
ఒకే కుటుంబానికి మూడు పథకాలను వర్తింపజేస్తే ఈ పథకాలకు నోచుకోకుండా ఉండిపోయిన వాళ్ళ నుంచి వ్యతిరేకత వస్తుందని లెక్కలు కడుతున్నారు. అందుకే అందరికీ ఏదో ఒక పథకం అందించి ఓట్లు పొందాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందుకోసం తమను కలుస్తున్న వారికి ఏదో ఓ పథకం ఇస్తాంలే..ఆందోళన చెందకండని ప్రజలకు ఎమ్మెల్యేలు నచ్చజెప్పి పంపుతున్నారు. ఎన్నికల వేళ కొంతమందికి పథకం అందించి మరికొంతమందికి సాయం చేయకపోతే అది మొదటికే మోసం చేస్తుందని అందుకే అర్హుల ఎంపికను ఆచితూచి చేపడుతున్నారు.
బీఆర్ఎస్ లీడర్లు, కార్యకర్తల కుటుంబాలకు మాత్రం మూడు పథకాలను వర్తింపజేస్తున్నారు. ఎమ్మెల్యేలను కలుస్తున్న వారు తమ గ్రామాల్లో పార్టీ కార్యకర్తలకు రెండు పథకాలను తప్పనిసరిగా వర్తింప చేయాలని పట్టుబడుతున్నారు. దాంతో ఎమ్మెల్యేలు కూడా తప్పకుండా చేద్దామని హామీ ఇస్తున్నారు. అయితే.. కొంతమందికి రెండు, మూడు పథకాలు అంది, మరికొంతమందికి ఒకే పథకం ద్వారా ప్రయోజనం చేకూరితే అది బీఆర్ఎస్ పై వ్యతిరేకత పెంచనుంది. అలాగే , బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకే ప్రయోజనం చేకూరింది అనే మెసేజ్ జనాల్లోకి బలంగా వెళ్తుంది.
అది అంతిమంగా బీఆర్ఎస్ ను దెబ్బ తీస్తుంది. మొత్తంగా ఎన్నికల వేళ పథకాలతో హడావిడి చేస్తోన్న బీఆర్ఎస్ ను అవే పథకాలు ముంచవచ్చు.. రక్షించవచ్చు.. చూడాలి మరి ఎం జరుగుతుందో..!!
Also Read : తెలంగాణలో అధికారం ఎవరిదీ..? వెల్లడి అయిన సర్వే ఫలితం..!