కాంగ్రెస్ ఆరు గ్యారంటీలు బీఆర్ఎస్ కు ఆందోళన కల్గిస్తున్నాయి. కర్ణాటకలో ఐదు గ్యారంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇక్కడ ఆరు గ్యారంటీలతో అదే తరహ ఫలితం రాబడుతుందని బీఆర్ఎస్ బెంగ. అందుకే ఆ పథకాలు ప్రకటన మరుసటి రోజు నుంచే 6 గ్యారంటీలు అమలు సాధ్యం కాదని బీఆర్ఎస్ ఎదురుదాడి మొదలు పెట్టింది. అయినప్పటికీ ఈ పథకాల పట్ల జనాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఆరు గ్యారంటీలపై ఎదురుదాడి చేస్తుండటంతో కాంగ్రెస్ పథకాలకు తామే ఫ్రీ ప్రమోషన్ చేసినట్లు అవుతుందని అధికార పార్టీ గ్రహించింది. అందుకే మరోసారి అధికారంలోకి వస్తే బీఆర్ఎస్ ఏం చేస్తుందో వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఫిక్స్ అయింది.
కాంగ్రెస్ ఆరు గ్యారంటీలకు కౌంటర్ గా మెరుపులాంటి పథకాలను ప్రకటించాలని బీఆర్ఎస్ బాస్ భావిస్తున్నారు. వచ్చే వారంలో ఎన్నికల షెడ్యూల్ రానుంది. ఈ లోపు ఎన్నికల మ్యానిఫెస్టోను రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో భాగంగా రైతు పెట్టుబడి సాయం కింద ఇచ్చే రైతు బంధు సాయాన్ని పెంచడం, ఆసరా ఫించన్లను పెంచడం, ఉద్యోగులకు డీఏ పెంపు హామీలు బీఆర్ఎస్ మ్యానిఫెస్టోలో ప్రధానంగా ఉండనున్నాయి. మహిళా ఓటర్లు అధికంగా ఉండటంతో వారి ఓట్లు రాబట్టేందుకు కాంగ్రెస్ ప్రకటించిన మహిళా లక్ష్మీ పథకానికి దీటుగా మహిళా బంధును ప్రవేశపెడితే ఎలా ఉంటుంది .? అని కేసీఆర్ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. 2018 ఎన్నికల్లో నిరుద్యోగ భృతి ఇస్తామని కేసీఆర్ హామీ ఇచ్చారు కానీ ఆహమీని నెరవేర్చలేదు. దీంతో నిరుద్యోగ యువత బీఆర్ఎస్ పై తీవ్ర ఆగ్రహంతో ఉంది. అందుకే వారికోసం ఓ కొత్త పథకం తీసుకురావాలని అనుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ను నిరుద్యోగ యువత ఈసారి నమ్మే పరిస్థితి లేదు.
గతంలో రైతులు, ఫించన్ దారులు బీఆర్ఎస్ గెలుపుకు ప్రధాన కారకులు అయ్యారు. ఇప్పుడు కూడా వారిపైనే కేసీఆర్ ఫోకస్ పెట్టారు. వారిని ఆకట్టుకునే పథకాల ప్రకటన ఉండాలని ప్రధానంగా భావిస్తున్నారు. శుక్రవారం కేబినేట్ సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో బీఆర్ఎస్ పథకాలపై చర్చించి వీటికి ఆమోదం తెలపనున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉంది కాబట్టి ఎన్నికలకు ముందే హామీలకు ఆమోదం తెలిపితే ప్రజల్లో విశ్వాసం కల్గుతుందనేది కేసీఆర్ ఆలోచనగా కనబడుతోంది.
Also Read : రైతులకు ఫించన్ – కేసీఆర్ సంచలన హామీ..?