నాగాలాండ్ ఎన్సీపీ రాష్ట్ర అద్యక్షుడు సులంతుంగ్ హెచ్ లోథా తెలంగాణ మంత్రి కొప్పుల ఈశ్వర్ తో ఇటీవల భేటీ అయ్యారు. నాగాలాండ్ లో బీఆర్ఎస్ విస్తరణపై వీరి భేటీలో ప్రధానంగా చర్చ జరిగినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అమలు అవుతోన్న సంక్షేమ పథకాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని ఈ సందర్భంగా మంత్రికి లోథా వివరించారు. నాగాలాండ్ లోనూ బీఆర్ఎస్ ను విస్తరించాలని.. వివిధ పార్టీలకు చెందిన నేతలు బీఆర్ఎస్ లో చేరేందుకు ఆసక్తి చూపిస్తున్నారని మంత్రి దృష్టికి తీసుకెళ్ళారు.
తమ రాష్ట్రంలోనూ బీఆర్ఎస్ ను విస్తరించాలని కోరినా లోథా..రాష్ట్రంలో పార్టీ బలోపేతానికి తాను చర్యలు తీసుకుంటానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఆయన త్వరలోనే బీఆర్ఎస్ లో చేరనున్నట్లు తెలుస్తోంది. వచ్చే నెలలో నాగాలాండ్ లో ఎన్నికలు జరగనున్న క్రమంలో లోథా బీఆర్ఎస్ మంత్రితో భేటీ కావడం హాట్ టాపిక్ అయింది. ఎన్నికల్లో పోటీకి ఆయనతోపాటు మరికొంతమంది ఆసక్తిగా ఉండటంతోనే ఈ భేటీ జరిగినట్లు సమాచారం.
ఇక,ఈ విషయమై చర్చించేందుకు బీఆర్ఎస్ అధినేతతో చర్చిద్దామని లోథాకు కొప్పుల వివరించారు. త్వరలోనే కేసీఆర్ అపాయింట్ మెంట్ తీసుకొని నాగాలాండ్ లో బీఆర్ఎస్ విస్తరణ, పోటీపై చర్చిద్దామని లోథాతో మంత్రి చెప్పినట్లు సమాచారం. దాదాపు కేసీఆర్ సానుకూలంగా స్పందించే అవకాశం ఉంది.
బీఆర్ఎస్ జాతీయ పార్టీగా గుర్తింపు పొందాలని కేసీఆర్ టార్గెట్ పెట్టుకున్నారు. ఇందుకోసం నాగాలాండ్ లో పోటీ చేస్తే పార్టీకి ఫ్రీ ప్రమోషన్ లభించినట్లు అవుతుందని అంచనాతో కేసీఆర్ ఉండొచ్చు. కాబట్టి బీఆర్ఎస్ పోటీ చేయబోయే మొదటి రాష్ట్రంగా నాగాలాండ్ రాష్ట్రం కానుంది.