ఇథనాల్ ఫ్యాక్టరీ విషయంలో బీఆర్ఎస్, బీజేపీ నేతల పరిస్థితి తేలు కుట్టిన దొంగల్లా తయారైంది. రైతుల ఆందోళనలతో ప్రజా ప్రభుత్వం తక్షణమే స్పందించి…అనుమతులపై పునరాలోచన చేస్తామని ప్రకటించింది. అయితే ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్, స్థానిక బీజేపీ ఎమ్మెల్యే కంటికి కూడా కనిపించడం లేదు. ఎందుకంటే అటువైపు వెళ్లే రైతులు తమను తరిమి కొడతారని బీఆర్ఎస్, బీజేపీ నేతలకు తెలుసు. అసలు ఇథనాల్ ఫ్యాక్టరీ అంశంపై కాంగ్రెస్ కు ఏ మాత్రం సంబంధం లేదు. కానీ ఆ బురదను ప్రస్తుత సర్కారుకు అంటించేందుకు కారు పార్టీ సోషల్ మీడియా ప్రయత్నిస్తోంది. అయితే దిలావార్ పూర్, గుండంపల్లి మధ్య ఇథనాల్ కంపెనీ కోసం బీఆర్ఎస్ హయాంలోనే అనుమతులు లభించాయన్న సంగతి బయటకు రావడంతో ఆ పార్టీ నేతలు కిక్కురుమనం లేదు.
ఇథనాల్ ఫ్యాక్టరీపై కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి ప్రక్రియ చేపట్టలేదు. కానీ రేవంత్ సర్కారుకు ఈ పాపాన్ని అంటగట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది బీఆర్ఎస్ పార్టీ. తమకు బాగా అలవాటైన కుట్రల సిద్ధాంతాన్ని దిలావార్ పూర్ విషయంలో అమలు చేస్తోంది. ప్రజల్ని రెచ్చగొట్టేందుకు ఒకరిద్దరు బీఆర్ఎస్ నేతలు ప్రయత్నించారు. అక్కడ కూడా అమాయక గిరిజనులకు మాయమాటలు చెప్పారు. కానీ అప్పటికే ఆ ఫ్యాక్టరీ పుట్టుపూర్వోత్తరాలు తెలిసిన స్థానికులు నిజాలను వివరించడంతో మెల్లగా బీఆర్ఎస్ నేతలు జారుకున్నారు. ఇక బీజేపీ నేతలైతే అటువైపు కూడా కన్నెత్తి చూడలేదు. చిన్న విషయాన్ని కూడా భూతద్దంలో పెట్టి చూపించే మహేశ్వర్ రెడ్డి..స్థానిక ఎమ్మెల్యే అయి ఉండి కూడా అటువైపు వెళ్లలేదు. ఎందుకంటే ఇథనాల్ కంపెనీకి అనుమతులు ఇచ్చిందే బీజేపీ కేంద్ర ప్రభుత్వం. ప్రజలు తమను ఎక్కడ నిలదీస్తారో అనే భయంతో బీజేపీ నేతలు దీనిపై నోరు మెదపడం లేదు.
ఇథనాల్ ఫ్యాక్టరీ లో డైరెక్టర్ లుగా బిఆర్ఎస్ నేతలైన తలసాని సాయికుమార్, మరో వ్యక్తి ఉన్నారు. అయితే ఆందోళన చేస్తున్న రైతులతో మాట్లాడేందుకు వెల్లిన ఆర్డీవో పై బీఆర్ఎస్, బీజేపీకి చెందిన వ్యక్తులు దాడులు చేశారు. అది వర్కవుట్ అవ్వకపోవడంతో సోషల్ మీడియాలో విషం చిమ్ముతున్నారు. ఇక్కడ బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి తలసాని జోక్యం చేసుకొని అదెప్పుడో ముగిసిపోయిన అంశం అంటూ సన్నాయి నొక్కులు నొక్కారు. 2016లో తన తనయుడు ఇథనాల్ ఫ్యాక్టరీ పెట్టాలని చూశాడని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. కానీ 2022 ఏప్రిల్ 14న పీఎంకే డిస్టిలేషన్ కంపెనీ ఇదనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసుకునేందుకు అప్లై చేసుకుంది. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం 2023 ఏప్రిల్ 3వ తేదీన ఈ డిస్టిలరీ కంపెనీకి (లెటర్ ఆఫ్ ఇండెంట్) అనుమతులు మంజూరు చేసింది. అంతేకాదు 2023 జూన్ 15వ తేదీన కాళేశ్వరం ప్యాకేజీ నెం.27 నుంచి అప్పటి ఇరిగేషన్ విభాగం నీళ్లను కూడా కేటాయించింది. ఇవన్నీ బయటకు రావడంతో ఏం చేయాలో తెలియక ఇప్పుడు బీఆర్ఎస్ నేతలు తలలు పట్టుకున్నారు.