బీఆర్ఎస్ పేరుతో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశిస్తామని ప్రకటించిన కేసీఆర్ పలు రాష్ట్రాల్లో బీఆరెఎస్ పోటీ చేస్తుందన్నారు. తెలంగాణ మోడల్ ను దేశానికి పరిచయం చేస్తామని గొప్పగా ప్రకటించుకున్నారు. తమకు వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రాజకీయ నేతలు, రిటైర్డ్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల నుంచి మద్దతు ఉందని, వారంతా బీఆర్ఎస్ లో చేరుతారని ప్రచారం చేసుకున్నారు. కాని, బీఆర్ఎస్ ప్రకటన సమయంలో ఒక్క కుమారస్వామి మినహా ఎవరు చరిష్మా కల్గిన నేతలు పాల్గొనలేదు. దీంతో బీఆర్ఎస్ కు తెలుగు మీడియా తీసుకురావాలనుకున్న హైప్ అంతగా రాలేదు.
శుక్రవారం మంత్రి కేటీఆర్ మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ సందర్భంగా బీఆర్ఎస్ పోటీపై క్లారిటీ ఇచ్చారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని ప్రకటించారు. ఈ రెండు రాష్ట్రాలు కాంగ్రెస్ కు బాగా పట్టున్న రాష్ట్రాలు కావడం గమనార్హం. ఇప్పటికే కాంగ్రెస్ మిత్ర పక్షాలను విచ్చిన్నం చేసేందుకు బీఆర్ఎస్ పేరుతో కేసీఆర్ నాటకాలు ఆడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇందుకు బలం చేకూర్చుతు కేటీఆర్ తాజా వ్యాఖ్యలు ఉన్నాయి. కర్ణాటకలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశం ఉండగా.. అక్కడ అధికార బీజేపీ వ్యతిరేక ఓటు బ్యాంక్ ను చీల్చడం కోసం బీఆర్ఎస్ బరిలో నిలవనుందనే విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. మహారాష్ట్రలో కూడా శివసేన మద్దతుతో కాంగ్రెస్ కూటమి తిరిగి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది. కాంగ్రెస్ కు ఎక్కడైతే పట్టుంటుందో ఆ ప్రాంతాల్లో బీఆరెస్ బరిలో నిలిచి అంతిమంగా బీజేపీకి లబ్ది చేకూర్చడమే బీఆర్ఎస్ ఎజెండాగా తెలుస్తోంది.
అదే సమయంలో , త్వరలో గుజరాత్ లో ఎన్నికలు జరగనున్నాయి. అక్కడ మాత్రం బీఆర్ఎస్ పోటీ చేస్తుందని కేటీఆర్ ప్రకటించకపోవడం చర్చనీయంశంగా మారింది. మోడీ డైరక్షన్ లోనే కేసీఆర్ బీఆర్ఎస్ అనే కథా చిత్రాన్ని రూపొందించారని అంటున్నారు. ఈ వాదనకు బలం చేకూర్చేలా కేటీఆర్ వ్యాఖ్యలు ఉన్నాయి.