తెలంగాణ దుఃఖిస్తోంది. ఉబికివస్తోన్న కన్నీటిని దిగమింగుకోలేక.. ప్రభుత్వాధినేత హామీ అమలుకై నిలదీసేందుకు వెళ్లిన సామాన్యుల ఊపిరితీయాలనే అధికార పార్టీ నాయకుల అరాచకాన్ని చూసి ఊపిరాడక రోదిస్తోంది. ఎవనిపాలయిందిరా తెలంగాణ అని ఉద్యమకారులను కన్నీటితోనే ప్రశ్నిస్తోంది.
మార్కేండయ ప్రాజెక్టు నిర్మిస్తానని హామీ ఇచ్చిన కేసీఆర్ ఆ ప్రాజెక్టు గురించి మాట్లాడటమే లేదు. ఎప్పుడు పనులు ప్రారంభిస్తారో తెలియదు. ఎప్పటికీ పూర్తి చేస్తారో క్లారిటీ లేదు. కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రాజెక్టును ఎందుకు నిర్మించడం లేదని కాంగ్రెస్ నేతలు ఆ ప్రాజెక్టు స్థల సందర్శనకు పిలుపునిచ్చారు. అ ప్రాజెక్టు ఉన్నది పాకిస్తాన్ సరిహద్దులో అన్నట్లు అక్కడికి వెళ్తున్న రైతులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ కార్యకర్తలను స్థానిక ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి ఉసిగొల్పాడు.ఇంకేముంది బీఆర్ఎస్ కార్యకర్తలు రెచ్చిపోయారు.
దొరికిన వారిని దొరికినట్టుగా చితకబాదారు. నన్ను వదిలిండేయా మీ కాళ్ళు పట్టుకుంటానని బాల్య నాయక్ అనే గిరిజన వ్యక్తి బతిమాలితే.. గొంతుపై కాలేసి అణచివేశారు. హాహాకారాలు చేస్తున్నా పట్టించుకోలేదు. ఊపిరి అందడం లేదు.. పిల్లాజెల్లా ఉన్నోన్ని..పుణ్యం ఉంటుంది.. నన్ను వదిలియండయా అని వేడుకున్నా కనికరించలేదు. అచ్చంగా అగ్రరాజ్యంలో నల్లజాతీయుడనే కక్ష్యతో జార్జ్ ఫ్లాయిడ్ ను ఎలాగైతే అక్కడి పోలీసులు మెడపై కాలుమోపి ఊపిరిరాడకుండా చేసి ప్రాణాలు బలి తీసుకున్నారో.. అలాంటి సీనే మామ్మాయిపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.
కాకపోతే అక్కడ నల్లజాతీయుడని ఫ్లాయిడ్ ప్రాణాలు తీశారు.. ఇక్కడ మాత్రం గిరిజన వ్యక్తి అనే కాకుండా కాంగ్రెస్ పార్టీ కార్యకర్త అయి ఉంటాడని అతని ఉసురు తీయాలని అనుకున్నారు. అధికారముంది కదా.. ఎమ్మెల్యే మనోడే కదా. ఎం చేసిన చెల్లుబాటు అవుతుంది కదా అనే ధీమా అధికార పార్టీ కార్యకర్తల్లో కల్గుతుంటే ప్రతిపక్ష పార్టీల కార్యకర్తలు, సామాన్యులు గొంతెత్తి స్వేఛ్చ కోసం మాట్లాడితే, హక్కుల కోసం ధిక్కరిస్తే దౌర్జన్యం చేయడమే ఇక్కడ న్యాయం. ప్రశ్నించడమే ఇక్కడ రాజ్యద్రోహం. ఇదే బంగారు తెలంగాణలో అమలౌతున్న అ’ప్రజాస్వామ్యం’.